పల్లె గడపలే నిప్పుకణికలు.. నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డిన సామాన్యులు  
close
Updated : 17/09/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పల్లె గడపలే నిప్పుకణికలు.. నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డిన సామాన్యులు  

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి

దాస్య శృంఖలాల నుంచి పురిటిగడ్డ విముక్తికి.. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగిన మహోజ్వల ఘట్టమది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానిది దశాబ్దాల చరిత్ర. ఈ మహోద్యమంలో సామాన్యులే నాయకులయ్యారు. మహిళలు పోరాటంలో ముందుండి నడిచారు. యువత ప్రధాన భూమిక పోషించింది. పల్లెపదం ఉద్యమానికి ఊపిరులూదింది. కులాలు, మతాలు, వర్గాలకతీతంగా పోరు సాగింది. నాటి నిజాం సర్కారు తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ఎందరో ప్రాణత్యాగం చేశారు. మరెందరినో ప్రభుత్వం ఉరితీసింది. 1946 జులై నాలుగో తేదీకి ముందు సాగిన పోరాటం ఒక ఎత్తయితే... ఆ రోజు కడవెండిలో పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అసువులు బాయడం, బైరాన్‌పల్లి వీరుల తెగువ, చాకలి ఐలమ్మ సాహసం సాయుధ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశాయి. సిరిసిల్ల, కడవెండి, బైరాన్‌పల్లి సహా అనేక ప్రాంతాలు చరిత్రలో నిలిచాయి. నిజాం పాలనకు, నాటి జమీందారుల దాష్టీకాలకు చరమగీతం పాడేవరకు వాటి స్ఫూర్తి కొనసాగింది. పోరాటాలకు జడిసి దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. వారి భూముల్లో పేదలు అడుగుపెట్టారు. ప్రపంచంలో ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని పద్మభూషణ్, ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్‌.హనుమంతరావు పేర్కొనడం గమనార్హం. 

పీడనపై పిడికిలెత్తిన నల్గొండ 

రజాకార్లు, పోలీసుల దౌర్జన్యాలకు, వెట్టి, అక్రమ నిర్బంధం, వసూళ్లకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతులు, సామాన్య ప్రజలు పోరాటం చేశారు. సభలు, ప్రదర్శనలతో చైతన్యం రగిలించారు. భూస్వాముల గడీల ముందు బహిరంగసభలు నిర్వహించారు. జమీందారీ విధానం రద్దు, భూస్వాముల పీడన, పొలీసుల జులుంకు స్వస్తి, నిర్బంధ ధాన్యం సేకరణ, వెట్టిచాకిరి, అవినీతి అంతం నినాదాలతో ఉద్యమం సాగింది. ప్రజాగ్రహానికి వెరచి భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు ఇళ్లకే పరిమితమయ్యారు. భూపోరాటంపై చాకలి ఐలమ్మ రాసిన పాటలు మహిళలను విశేషంగా ఆకట్టుకుని కదనరంగంలోకి దూకేలా చేశాయి. అధికారులను గ్రామాల్లో పాదం మోపనీయలేదు. ప్రజా ఉద్యమంతో ప్రభుత్వానికి ధాన్యం సేకరణ అసాధ్యమైంది. దేశ్‌ముఖ్‌లు, గ్రామాధికారులు పలాయనం చిత్తగించారు. నల్గొండ జిల్లాలో రగిలిన ఉద్యమ జ్వాలలు కొన్ని వారాల్లోనే పొరుగున ఉన్న వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందల గ్రామాలకు వ్యాపించాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కీలక ఘట్టానికి కడవెండి, పాలకుర్తి గ్రామాలు తెరతీశాయి. కడవెండి గ్రామంపై పోలీసుల సాయంతో దేశ్‌ముఖ్‌లు దాడి చేశారు. 15 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు విడుదలయ్యారు. 1946 జులై 4న పోలీసులు ఇళ్లపై దాడి చేయగా వారిని గ్రామస్థులు ఎదుర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా గ్రామస్థులు ఊరేగింపు తీయగా.. దానిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఊరేగింపునకు నాయకత్వం వహిస్తున్న దొడ్డి కొమరయ్య అసువులు బాయడం గ్రామస్థుల్లో ఆగ్రహానికి, ఉద్యమ జ్వాలకు బీజం వేసింది. మరోవైపు పాలకుర్తి బహిరంగసభపై జమీందారు గూండాలు దాడులు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు వారిపై కేసులు పెట్టడంతోపాటు రకరకాల యత్నాలు చేశారు. చాకలి ఐలమ్మ భూమిని స్వాధీనం చేసుకునేందుకు, ఆమె ఇంట్లోని ధాన్యాన్ని తరలించేందుకు వందల మంది కూలీలు, గూండాలు రాగా.. ప్రజలు ఎదురుదాడి చేయడంతో పారిపోయారు. 

చిరస్మరణీయం..  వీరబైరాన్‌పల్లి పోరాటం

తెలంగాణ ప్రజాపోరాటాన్ని శిఖర స్థాయికి చేర్చింది బైరాన్‌పల్లి పోరాటం. సుమారు 60 మంది రజాకార్లు, పోలీసులు గ్రామంపై దాడి చేయగా.. ఊరిలోని బురుజు కేంద్రంగా గ్రామస్థులు నాటుతుపాకులు, వడిశెలు, బర్మార్లతో ఎదురుదాడి చేశారు. దీంతో రజాకార్లు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాతా వారు పలుమార్లు గ్రామాన్ని ముట్టడించినా గ్రామస్థులు గెరిల్లా పోరాటంతో ఎదురొడ్డి పోరాడారు. 1948 ఆగస్టు 27న నిజాం సైన్యం ప్రతీకారంతో ఫిరంగులు, బ్రెన్‌గన్లు, మంటలబాంబులు, ఇతర ఆయుధాలతో గ్రామంపై దాడి చేసింది. బైరాన్‌పల్లి వాసులు నాటుతుపాకులతోనే  పోరాడారు. శత్రువు బలం ముందు వారు నిలువలేకపోయారు. కొందరిని సైనికులు నిర్బంధించి, కాల్చి చంపారు. మరికొందరు యువకుల్ని హింసించి చంపేశారు. మొత్తం 118 మంది అమరులయ్యారు. బైరాన్‌పల్లి పోరాటం సమీపంలోని ధూళిమిట్ట, ఆకునూరు, లింగాపురం, కూటిగల్లు సహా పలు గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచింది. కూటిగల్లు గ్రామాన్ని 300 మంది రజాకార్లు, పోలీసులు చుట్టుముట్టి ఇళ్లు, గడ్డివాములకు నిప్పుపెట్టారు. వారితో గ్రామస్థులు గెరిల్లా పోరాటం చేశారు. శత్రువుల్లో ముగ్గురు చనిపోగా.. మిగిలినవారు పారిపోయారు. పోలీసు చర్య జరిగేవరకూ రజాకార్లు, పోలీసులు గ్రామం పొలిమేరలకు కూడా రాలేదంటే గ్రామస్థుల పోరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. 1948 సెప్టెంబరు 17న భారత్‌లో అంతర్భాగమయ్యేవరకూ గ్రామాన్ని వారే సొంతంగా పాలించుకున్నారు. - ఈనాడు, హైదరాబాద్‌ 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని