టర్కీ.. కశ్మీర్‌ విషయంలో మీ జోక్యం తగదు
close
Updated : 15/02/2020 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టర్కీ.. కశ్మీర్‌ విషయంలో మీ జోక్యం తగదు

స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ

దిల్లీ: కశ్మీర్‌ అంశంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తైపీ ఎర్డోగాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో జోక్యం చేసుకోవడం తగదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ఎర్డోగాన్‌ శుక్రవారం ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘కశ్మీర్‌ సోదరసోదరీమణులు దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వారి బాధలు మరింత ఎక్కువయ్యాయి. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం శాంతియుత, న్యాయపరమైన చర్చలకు టర్కీ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది’ అని ఎర్డోగాన్‌ చెప్పుకొచ్చారు. అంతేగాక, కశ్మీర్‌ ప్రజల పరిస్థితిని.. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విదేశీ ఆధిపత్యంపై టర్కీ ప్రజల పోరాటంతో పోల్చారు. 

దీంతో ఎర్డోగాన్‌ వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ‘జమ్ముకశ్మీర్‌ను ఉద్దేశించి టర్కీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను భారత్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోంది. కశ్మీర్‌ పూర్తిగా భారత సమగ్ర, శాశ్వత భూభాగం. అందువల్ల భారత అంతర్గత విషయాల్లో టర్కీ నాయకత్వం అనవసర జోక్యం చేసుకోవడం మాని, నిజానిజాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాక్‌ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం వల్ల భారత్‌కు ఎంతటి ముప్పు ఉందో తెలుసుకోవాలి’ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పష్టంగా చెప్పారు. 

కాగా.. కశ్మీర్‌ విషయంలో ఎర్డోగాన్‌ పాక్‌కు మద్దతివ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్‌ పాక్‌కు అనుకూలంగా మాట్లాడారు. అయితే అప్పుడు కూడా భారత్‌ ఆయన వ్యాఖ్యలను ఖండించింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని