Afghanistan: అఫ్గాన్‌లో అబ్బాయిలకే చదువు 
close
Updated : 18/09/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Afghanistan: అఫ్గాన్‌లో అబ్బాయిలకే చదువు 

6-12 తరగతులవారు బడులకు వెళ్లాలని ఆదేశాలు 
అమ్మాయిల చదువుపై ఉత్కంఠ 

ఇస్తాంబుల్‌: అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలు చదువుకునేందుకు అనుమతి ఉండబోదేమోనని ఊహాగానాలు వెలువడుతున్నవేళ.. వాటికి బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. 6-12 తరగతుల అబ్బాయిలు శనివారం నుంచి పాఠశాలలకు హాజరు కావాలంటూ తాలిబన్ల నేతృత్వంలోని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. పురుష ఉపాధ్యాయులూ విద్యాసంస్థలకు వెళ్లాలని ఆదేశించింది. 6-12 తరగతుల అమ్మాయిల గురించి మాత్రం ప్రస్తావించలేదు. దీంతో వారి చదువుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 1-5 తరగతుల విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లేందుకు తాలిబన్లు ఇప్పటికే అనుమతి మంజూరు చేసిన సంగతి గమనార్హం. 1990ల్లో అధికారంలో ఉన్నప్పుడు అమ్మాయిలు పాఠశాలలకు వెళ్లకుండా, మహిళలు పనిచేయకుండా తాలిబన్లు నిషేధాజ్ఞలు విధించారు. 

అఫ్గాన్‌తో ఐఎంఎఫ్‌ కటీఫ్‌ 

వాషింగ్టన్‌: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది! ఆ దేశంతో తమ సంబంధాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ ప్రకటించింది. తాలిబన్‌ సర్కారును అధికారికంగా గుర్తించడంపై అంతర్జాతీయ సమాజంలో స్పష్టత వచ్చేదాకా సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని సంస్థ అధికార ప్రతినిధి జెర్రీ రైస్‌ తెలిపారు. అఫ్గాన్‌లో ఆర్థిక పరిస్థితి తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. 

తాలిబన్లపై ఉగ్రముద్రకు సెనేట్‌లో బిల్లు  

తాలిబన్‌ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని పలువురు రిపబ్లికన్‌ నేతలు తాజాగా డిమాండ్‌ చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పాటుచేసిన తాత్కాలిక కేబినెట్‌లో.. ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలోని పలువురు ఉగ్రవాదులు ఉన్న సంగతిని గుర్తుచేశారు. వారి సర్కారును అధికారికంగా గుర్తించే దేశాలపై ఆంక్షలు విధించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ‘‘ఉగ్రవాద రాజ్యాల గుర్తింపు నిరోధక చట్టం’’ పేరుతో రిపబ్లికన్‌ సెనేటర్లు మార్కో రూబియో, టామీ టుబెర్‌విల్లె, మూర్‌ కాపిటో తదితరులు సెనేట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. అఫ్గాన్‌ను ఉగ్రవాద ప్రాయోజిత దేశంగా అమెరికా గుర్తిస్తుంది. 

పిల్లల ఆకలి తీర్చేందుకు గృహోపకరణాల అమ్మకం 

కాబుల్‌: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఉపాధి దొరక్క, ఇల్లు గడవక అనేకమంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కన్నబిడ్డల ఆకలి తీర్చేందుకు.. ఇంట్లో ఉన్న టీవీ, రిఫ్రిజిరేటర్, సోఫా, అల్మారాల వంటి విలువైన వస్తువులను చాలా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. దీంతో కాబుల్‌ వీధులన్నీ సంతలను తలపిస్తున్నాయి. ‘‘నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి తిండి పెట్టగలిగితే చాలనుకున్నా. అందుకే 25 వేల అఫ్గానీలు పెట్టి కొన్న రిఫ్రిజిరేటర్‌ను నేను ఇప్పుడు 5 వేలకే అమ్మేశాను. ఇంతకంటే ఏం చేయగలను?’’ అని లాల్‌ గుల్‌ అనే దుకాణదారుడు మీడియా ఎదుట తాజాగా వాపోయారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని