Cinema News: కాటుక కళ్లు దానం చేసింది - kajal agarwal birthday special
close
Updated : 19/06/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: కాటుక కళ్లు దానం చేసింది

కాటుక కూడా అవసరం లేని కళ్లు కాజల్‌వి. చందమామ కూడా అసూయ పడే సొగసుతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కట్టిపడేసిన ఉత్తరాది అందం ఆమె‌ది. చీరకట్టుతో రాధమ్మగా ఆకట్టుకొని, ‘పక్కా లోకల్‌’ అంటూ మాస్‌ స్టెప్పులతోనూ వెండితెరను ఊపేసింది ఈ సుందరి. బాలీవుడ్‌లో కళ్లు లేని అంధురాలిగా నటించి విస్మయానికి గురి చేసింది. అందం, అభినయం కలిసిన పంచదార బొమ్మ కాజల్‌. ఇవాళ ఆ అందం పుట్టిన రోజు. ఈ సందర్భంగా కాజల్ సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం. 

హిందీలోనే తొలి అడుగు 


 

కాజల్ ‌అగర్వాల్‌ పంజాబీ కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రులు ముంబయిలోనే స్థిరపడ్డారు. చదువంతా అక్కడే సాగింది. మాస్‌ కమ్యునికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కాజల్‌.. కొన్నాళ్లు మోడలింగ్‌ చేసింది. అప్పుడే ‘క్యు హో గయా న’ (2004) అనే అనే హిందీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. వివేక్‌ ఒబెరాయ్‌, ఐశ్వర్యరాయ్‌ జంటగా నటించిన చిత్రమది. అనంతరం తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో ‘బొమ్మలాట్టమ్’‌ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యంగా (2008) విడులైంది. దీంతో తెలుగులో కళ్యాణ్‌ రామ్‌తో చేసిన లక్ష్మి కల్యాణం (2006) హీరోయిన్‌గా ఆమెకు తొలి సినిమా అయింది. 

‘చందమామ’తో బోణీ

కళ్యాణ్‌రామ్‌తో చేసిన ‘లక్ష్మి కల్యాణం’ ఆశించినంతగా ఆడలేదు. రెండో చిత్రం ‘చందమామతో’నే మొదటి విజయం లభించింది. ఆ సినిమాలో సింధుమీనన్‌, నవదీప్‌తో చేసిన అల్లరి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కాజల్‌ అందచందాలు తెలుగు యువతను ఫిదా చేశాయి. చిన్న సినిమాగా విడుదలైన ఆ చిత్రం భారీ విజయం సాధించింది. రెండో సినిమాతోనే తెలుగులో అభిమానులను సంపాదించుకుంది కాజల్‌.

మిత్రవిందగా హొయలు

‘చందమామ’తో విజయం సాధించిన రెండేళ్లకు కానీ కాజల్‌కు సరిపడా విజయం దక్కలేదు. ‘పౌరుడు’, ‘ఆటాడిస్తా’ లాంటి సినిమాల్లో నటించింది. అవీ బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ సినిమాలుగానే మిగిలిపోయాయి. రెండేళ్ల నుంచి హిట్‌ కోసం ఎదురుచూసిన కాజల్‌కు జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర దక్కింది. రాజమౌళి తీసిన ‘మగధీర’లో యువరాణి మిత్రవిందగా నటించే అవకాశం దక్కింది. బిందు, మిత్రవింద ఇలా రెండు పాత్రల్లో మెప్పించింది. ఆ సినిమా ఇండస్ర్టీ హిట్‌గా నిలిచి అప్పటి వరకు ఉన్న రికార్డులను చెరిపేసింది. దీంతో కాజల్‌ కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది.

వరుస హిట్లు

ప్రభాస్‌ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన్న ‘డార్లింగ్‌’తో మాయ చేసింది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం యువతకు తెగ నచ్చేసింది. తమిళంలో కార్తితో ‘నాన్‌ మహన్‌ అల్లా’ (నా పేరు శివ)  సినిమాకు మంచి వసూళ్లు దక్కాయి. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన  ‘బృందావనం’ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. 2011లో ‘మిస్టర్‌ పర్ఫెక్ట్’‌, హిందీలో ‘సింగమ్’‌ సినిమాలతో కాజల్‌కు తిరుగులేకుండా పోయింది. అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ‘బిజినెస్‌ మేన్‌’‌, ‘టెంపర్’‌, ‘తుపాకీ’, ‘వివేకం’, ‘ఖైదీ నెంబర్‌ 150’ లాంటి విజయవంతమైన సినిమాల్లో స్టార్ల సరసన ఆడిపాడింది. 

అంధురాలిగా అందాల బొమ్మ

టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాల్లో గ్లామర్‌ డాల్‌గా వెలిగిపోయిన కాజల్‌.. హిందీలో మాత్రం ఓ ప్రయోగాత్మక చిత్రం చేసింది. ‘దో లఫ్జోంకి కహానీ’ సినిమాలో అంధురాలిగా కనిపించింది. బాక్సర్‌తో ప్రేమలో పడే జెన్నీ అనే యువతిగా నటించి మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం సక్సెస్‌ కాలేకపోయిన కాజల్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

కాటుక కళ్లు దానం చేసింది

 

‘దో లఫ్జోంకి కహాని’ సినిమాలో అంధురాలిగా నటించిన తర్వాత వారి కష్టాలు తెలిసి కరిగిపోయింది కాజల్‌. అంధుల జీవితాల్లోని చీకటిని చూసింది గనుకే వెలుగు పంచాలనుకుంది. కాటుక కూడా అవసరం లేనంత అందంగా ఉండే ఆ కళ్లను ఆ సినిమా చేస్తున్న సమయంలోనే తన తదనంతరం దానం చేసి పెద్ద మనసును చాటుకుంది. మేడం టుస్సాడ్‌లో కాజల్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘనత సాధించిన తొలి సౌతిండియన్‌ నటిగా కాజల్‌ నిలిచింది.

రాణా తోడు.. రాధమ్మగా

తేజ తీసిన పొలిటికల్‌ డ్రామా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో కాజల్‌ నటనకు ప్రశంసలు కురిశాయి. అధికారం కోసం పాకులాడే జోగేంద్రను అదుపులో పెట్టే భార్యగా, సంతానలేమితో బాధపడే రాధమ్మగా ఒదిగిపోయింది. సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచింది. అచ్చ తెలుగింటి ఇల్లాలిగా టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రశాంత్‌ వర్మ ‘అ’లో వైవిధ్యమైన పాత్రలో నటించి ఆశ్చర్యపరిచింది. 

పక్కా లోకల్‌తో ఐటమ్ గర్ల్‌

హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉంటున్న సమయంలోనే ఐటమ్‌ గర్ల్‌ అవతారం ఎత్తింది కాజల్‌. ‘పక్కా లోకల్’‌ ఉంటూ ‘జనతా గ్యారేజ్’‌లో ఎన్టీఆర్‌తో స్టెప్పులేసింది. ఆ పాట కూడా సూపర్‌ హిట్‌. ఎన్టీఆర్‌తో పోటీపడి వేసిన స్టెప్పులతో పాటకు ఊపు తెచ్చింది. వెండితెర మీద ఆరబోసిన అందాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. 

లెజెండ్స్ సరసన

గత కొంత కాలంగా కాజల్‌ను వరుస ఫ్లాప్‌లు వెంటాడుతున్నాయి. ‘మెర్సల్‌’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద తేలిపోయాయి. ఎమ్మెల్యే, కవచం, సీత, మోసగాళ్లు సినిమాలు సరిగా ఆడలేదు. అయినా ఎక్కడ తగ్గదే లేదు అన్నట్లుగా భారీ సినిమాల్లో నటిస్తోంది. మెగాస్టార్‌తో ఇదివరకే నటించిన కాజల్‌ మరోసారి ఆయనకు జోడీగా నటిస్తోంది. కొరటాల శివ ‘ఆచార్య’లో హీరోయిన్‌గా చేస్తోంది. భారతీయుడు సీక్వెల్‌లోనూ కమల్‌ హాసన్‌ సరసన కనిపించనుంది. 

పెళ్లైనా జోరు తగ్గలేదు

సాధారణంగా హీరోయిన్లు వివాహంతోనే వారి సినీ కెరీర్‌ కూడా ముగిసిపోతుంది. కానీ కాజల్‌కు మాత్రం చేతినిండా సినిమాలున్నాయి. గతేడాది గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకుంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం తన చేతిలో ఎనిమిది చిత్రాలున్నాయి. ఇంకా మరికొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించాల్సి ఉంది. వరుసగా చిత్రీకరణలతో బిజీగా ఉంటున్న ఈ చందమామ తన భర్త చెబితే సినిమాలు చేయడం ఆపేస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఆమె నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘లైవ్‌ టెలికాస్ట్’కి ‌కూడా మంచి పేరొచ్చింది. పంజాబ్‌లో పుట్టి పెరిగినప్పటికీ, అచ్చ తెలుగు ఆడపిల్లలా, తమిళ పొన్నుగా అలరించి పూర్తి సౌతిండియన్‌ అమ్మాయిగా మారిపోయిన చందమామకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని