Sports News: అదే నేను చేసిన తప్పు: షా   - prithvishaw opens up about the reason behind his ban for taking cough syrup
close
Published : 24/05/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sports News: అదే నేను చేసిన తప్పు: షా 

డోపింగ్‌ టెస్టుపై వివరణ ఇచ్చిన యువ ఓపెనర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ పృథ్వీషా 2019లో డోపింగ్‌ టెస్టులో పట్టుబడి 8 నెలలు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, అది తెలియక చేసిన తప్పని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో వివరించాడు. అందుకు తాను, తన తండ్రి కారణమని పృథ్వీ అన్నాడు.

‘డోపింగ్‌ టెస్టులో పట్టుబడటానికి నేనూ, మా నాన్న కారణం. ఆ సమయంలో నేను ఇండోర్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడుతుండగా జలుబు, దగ్గుతో ఇబ్బంది పడ్డాను. రాత్రి భోజనం చేసేందుకు బయటకు వెళ్లాక విపరీతమైన దగ్గు వచ్చింది. దాంతో మా నాన్నను సంప్రదిస్తే బయట మార్కెట్‌లో దొరికే కాఫ్‌ సిరప్‌ తీసుకోమని చెప్పారు. అప్పుడు ఫిజియోను సంప్రదించకుండా నిషేధించిన ఆ డ్రగ్‌ తీసుకోవడమే నేను చేసిన తప్పు. రెండురోజులు ఆ సిరప్‌ తీసుకున్నాక, మూడో రోజే డోపింగ్‌ టెస్టు నిర్వహించారు. దాంతో నేను పాజిటివ్‌గా దొరికిపోయాను. దాని గురించి మాటల్లో చెప్పలేను’ అని పృథ్వీ తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. అది తనకు కష్టతరమైన సందర్భమని, ఆ సమయంలో ప్రజలు తన గురించి ఏమనుకుంటారోనని ఆందోళన చెందినట్లు ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ పేర్కొన్నాడు.

కెరీర్‌లో మంచి స్థితికి చేరుతున్న వేళ ఇలా ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడం బాధగా అనిపించిందన్నాడు. రెండున్నర నెలలు దాని గురించే ఆలోచించానని తెలిపాడు. కాగా, బీసీసీఐ ఆ సమయంలో పృథ్వీకి 8 నెలల నిషేధం విధించగా అందులో అప్పటికే ఎక్కువ శాతం అంతర్జాతీయ ఆటకు దూరమైన కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో కేవలం రెండున్నర నెలల్లోనే ఈ యువ ఓపెనర్‌ నిషేధ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికైనా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత జట్టుకు మళ్లీ దూరమయ్యాడు. అయితే, ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో తన తప్పులు సరిదిద్దుకొని అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని