రాహుల్‌ విజేత.. అతడే ఓపెనర్‌: కోహ్లీ - rahul is champion player and he will continue to open kohli
close
Published : 17/03/2021 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌ విజేత.. అతడే ఓపెనర్‌: కోహ్లీ

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌కు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడు. అతడో మ్యాచ్‌ విజేతని పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్లో రోహిత్‌శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసేందుకు అతడే అత్యుత్తమని స్పష్టం చేశాడు. మూడో టీ20లో పరాజయం తర్వాత విరాట్‌ మీడియాతో మాట్లాడాడు.

గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ నేరుగా ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. మధ్యలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. టీ20 సిరీసులో వరుసగా మూడు మ్యాచుల్లో 1, 0, 0కు వెనుదిరిగాడు. దాంతో టీమ్‌ఇండియాకు శుభారంభాలు దక్కడం లేదు. మరోవైపు విరాట్‌ ఫామ్‌ అందుకున్నాడు. తొలి టీ20లో డకౌటైన అతడు తర్వాత మ్యాచుల్లో 73, 77 పరుగులతో అదరగొట్టాడు.

‘రెండ్రోజుల క్రితం వరకు నేనూ ఫామ్‌లో లేను. కేఎల్‌ రాహుల్‌ విజేత. మా బృందంలో అతడో కీలక ఆటగాడు. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. పొట్టి క్రికెట్లో ఫామ్‌లోకి రావడమనేది ఐదారు బంతుల వ్యవహారమే’ అని కోహ్లీ స్పష్టం చేశాడు. మూడో టీ20లో ఇంగ్లాండ్‌ పేసర్లు విసిరిన బంతులను విరాట్‌ స్టాండ్స్‌లోకి పంపించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ విజయానికి ఉపయోగపడని ఇన్నింగ్స్‌లు వృథాయేనని అతడు అంటున్నాడు.

‘జట్టు విజయాలకు ఉపయోగపడని ఇన్నింగ్స్‌తో ప్రయోజనం లేదు. కొత్త బంతితో బ్యాటింగ్‌ చేయడం కష్టమే. ఇంగ్లాండ్‌ బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేశారు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను పాటించారు. దానికి అదనపు వేగమూ తోడైంది. చిన్నదే అయినా మాకు మంచి భాగస్వామ్యం లభించింది. చివరి వరకు బ్యాటింగ్‌ చేసేందుకు నాకది ఉపయోగపడింది. క్రీజులో నిలదొక్కుకొని మంచి లక్ష్యం నిర్దేశించాలన్నదే నా ఉద్దేశం. రెండో అర్ధభాగంలో మా తీవ్రత తగ్గింది. హార్దిక్‌ బ్యాటింగ్‌ సత్తా తెలిసిందే. అతడు బంతితో మరికాస్త బాధ్యత తీసుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని కోహ్లీ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని