కరోనా తర్వాత పుంజుకున్న ఏకైక ఇండస్ట్రీ మనది - uppena blockbuster celebrations ram charan vaisshnav tej krithi shetty vijay sethupathi
close
Updated : 17/02/2021 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా తర్వాత పుంజుకున్న ఏకైక ఇండస్ట్రీ మనది

‘ఉప్పెన’ విజయోత్సవ సభలో రామ్‌చరణ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సమయంలో ఎంతో నష్టపోయి.. తర్వాత పుంజుకున్న మొదటి ఇండస్ట్రీ టాలీవుడ్‌ అని మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ‘ఉప్పెన’ను విజయవంతం చేసి  తెలుగు చిత్రసీమకు భరోసా ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలై భారీ విజయం సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం బుధవారం రాజమహేంద్రవరంలో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌ హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో మిగతా ఇండస్ట్రీలు సినిమా విడుదల చేయాలంటే భయపడుతున్న క్రమంలో సినిమాలను ఆదరిస్తున్నారు. కరోనా తర్వాత పుంజుకున్న ఏకైక ఇండస్ట్రీ మన తెలుగు సినీ ఇండస్ట్రీ. ‘ఉప్పెన’ను హిట్‌ చేసిన ప్రేక్షకులకు ఎంతో రుణపడి ఉంటాం. ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. విజయ్‌ సేతుపతి నటనను చూసి నేర్చుకోవాలనిపిస్తోంది. ముగ్గురు కొత్తవాళ్లతో సినిమా చేసిన నిర్మాతలకు హ్యాట్సాఫ్‌. ఒక గురువుగా సుకుమార్‌ గర్వపడేలా చేసిన బుచ్చిబాబు.. ఇలాంటి సినిమాలు మరిన్ని తీస్తాడన్న నమ్మకం ఉంది. వైష్ణవ్‌ గురించి చెప్పాలంటే.. మా అందరిలో బాగా ఆలోచించే శక్తి వైష్ణవ్‌ సొంతం. మా వెనకాల చిరంజీవి గారు, పవన్‌కల్యాణ్‌ ఉండటం మా అందరి అదృష్టం. కృతి రాబోయే రోజుల్లో డేట్స్‌ దొరకనంత బిజీ అయిపోతుంది’ అని చరణ్‌ అన్నారు.

డైరెక్టర్‌ బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా హిట్టయిందంటే మొదటి కారణం దేవిశ్రీప్రసాద్‌. ఆయనకు ఎంతో రుణపడి ఉంటా. సముద్రంలాంటి సంగీతం అందించారు. మా గురువు సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ఉప్పెన’ లాంటి క్లైమాక్స్‌ను ఒప్పుకోవాలంటే గట్స్‌ ఉండాలి. అందుకు చిరంజీవిగారు ఒప్పుకొని వైష్ణవ్‌ను నాకు అప్పజెప్పారు. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు. ఈ సినిమా ఆయనకు అంకితం’ అని అన్నారు. ‘ఈ సినిమా సంగీతం ఇంతలా విజయం సాధించిందంటే మా జట్టు సభ్యులందరి కష్టమే కారణం. లిరిక్‌ రైటర్లు, సౌండ్‌ టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు. అందరికంటే ముఖ్యంగా డైరెక్టర్‌ బుచ్చిబాబుగారికి ధన్యవాదాలు. తొలి సినిమాతోనే హీరోహీరోయిన్లు చాలా బాగా నటించారు. అబ్బాయిందరూ బేబమ్మా అంటుంటే.. అమ్మాయిలంతా ఆశీ అంటున్నారు. ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు.

హీరో వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంతపెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఆ పాత్ర చేయడానికి నేను కొంత ఇబ్బంది పడ్డాను. డైరెక్టర్‌ బుచ్చిబాబు నా దగ్గరుండి ధైర్యం చెప్పి నేర్పించారు. దేవిశ్రీప్రసాద్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. తెరమీద ఉన్నవాళ్లతో పాటు తెరవెనుక ఉన్న 300 మంది కృషితోనే ఈ సినిమా ఇంత విజయం సాధించింది’ అన్నారు.

హీరోయిన్‌ కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఇంత ప్రేమించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. బేబమ్మలాంటి మంచి పాత్రలో అవకాశం ఇచ్చిన బుచ్చిబాబుగారికి రుణపడి ఉంటా. డీఎస్పీగారు వందశాతం సంగీతం ఇస్తారనుకున్నాం.. కానీ. అంతకంటే ఎక్కువే ఇచ్చారాయన. వైష్ణవ్‌కు ఇలాంటి మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చానంటే నా తల్లిదండ్రులు కారణం. వాళ్లకు రుణపడి ఉంటాను’ అని ఆమె చెప్పింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని