కొవిడ్‌ ఉద్ధృతి ఆందోళనకరమే: WHO - who chief calls growth in virus cases worrying
close
Published : 16/04/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఉద్ధృతి ఆందోళనకరమే: WHO

కట్టడి చర్యలు కొనసాగించాలని దేశాలకు పిలుపు

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు నెలల్లో ఓ వారంలో నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని అన్ని దేశాలకు సూచించింది.

‘కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నమోదుకాని విధంగా వైరస్‌ వ్యాప్తి గరిష్ఠ స్థాయివైపు దూసుకెళుతోంది. ఇంతకుముందు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిన దేశాల్లోనూ ఈసారి కేసులు విపరీతంగా వస్తున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ఆందోళనకరంగానే ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా తీవ్రతను వివరించిన ఆయన, వైరస్‌ ధాటికి చిన్న దేశాలు కూడా ప్రభావితమవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో స్పష్టమవుతోందని గుర్తుచేశారు.

గడచిన కొన్ని వారాలుగా చాలా దేశాల్లో వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి చర్యలు తీవ్రతరం చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ఈ దఫా కొత్తరకాలు వెలుగు చూస్తున్నప్పటికీ, వైరస్‌ కట్టడికీ తీసుకునే చర్యలు ఒకేలా ఉంటాయని అభిప్రాయపడింది. ముఖ్యంగా టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌, చికిత్సతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో చేపడుతోన్న ‘కొవాక్స్‌’ కార్యక్రమం ద్వారా పేద, మధ్య ఆదాయ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా దేశాలకు దాదాపు 4కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 154 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 84 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం. వ్యాక్సిన్‌ పంపిణీలో అగ్రరాజ్యం అమెరికా ముందుండగా.. ఇప్పటికే అక్కడ దాదాపు 19.8కోట్ల డోసులను వినియోగించారు. ఇక చైనాలో 17.9 కోట్ల డోసులను అందించగా, మూడో స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పటివరకు 11కోట్ల 70లక్షల కరోనా డోసులను పంపిణీ చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని