close
టాలీవుడ్‌

అల్లూరి సీతారామరాజు + కొమరం భీమ్‌ = RRR

‘బాహుబలి’ తరవాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా.. అందులోనూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా.. ఇది చాలు. అంచనాలు ఆకాశాన్ని    తాకడానికి. ఇద్దరు  అగ్ర కథానాయకులు కలిసిన సినిమా కథ ఎలా ఉంటుంది? అందులో ఎవరి పాత్ర ఏమిటి? విలన్‌ ఎవరు? బడ్జెట్‌ ఎంత? ఇలా ఎన్ని రకాల ప్రశ్నలో. వాటన్నింటికీ సమాధానం చెప్పేసింది  ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీమ్‌. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇప్పటి వరకూ ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేశారు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. వారిద్దరి కథే.. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. అంతేకాదు... విడుదల తేదీ కూడా ఖరారు చేసేశారు. 2020  జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆలియాభట్‌, జైసీ ఎడ్గర్‌ జోన్స్‌ కథానాయికలుగా నటిస్తారు. కీలక పాత్రల్లో అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని కనిపిస్తారు.

టైటిల్‌ ఏమిటి?

సినిమా మొదలైనప్పట్నుంచే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’గా (రాజమౌళి,  రామారావు, రామ్‌చరణ్‌) చలామణీ అవుతోంది. చివరికి అదే పేరు ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’గానే విడుదల అవుతుంది. అయితే.. ఒకొక్క భాషలో ఒక్కో ప్రత్యేకమైన టైటిల్‌ని కూడా ప్రకటిస్తారు. ‘‘చాలామంది పంపిణీదారులు, శ్రేయోభిలాషులు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ బాగుందండీ.. అదే టైటిల్‌గా ఉంచవచ్చు కదా?’ అని అడిగారు. ఇంకొంతమంది ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. వాటిలో ఓ మంచి టైటిల్‌ని ఎంచుకోవాలని అనుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మా సినిమా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే బ్రాండింగ్‌తోనే విడుదల అవుతుంది. ఒకొక్క భాషలో ఒక్కో టైటిల్‌ని ప్రకటిస్తాం’’ అని రాజమౌళి చెప్పారు.

కథేంటి?

‘మగధీర’, ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ సినిమాలకు సంబంధించి కథేమిటో ముందే చెప్పేశారు రాజమౌళి. ‘ఎలాంటి సినిమా చూడబోతున్నాం?’ అనే అంచనాకు ప్రేక్షకుడు ముందే వచ్చేయాలన్నది ఆయన సిద్ధాంతం. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కథ గురించీ ఊహాగానాలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ చిత్ర కథని సంక్షిప్తంగా చెప్పేశారు రాజమౌళి. ‘‘1887లో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆంగ్లంతో పాటు వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. మూడేళ్ల పాటు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ మూడేళ్ల కాలంలో ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? అనే సంగతి తెలీదు. తిరిగొచ్చాక స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఆ తరవాత ఏం చేశారో అందరికీ తెలిసిందే. అలాగే 1909లో కొమరం భీమ్‌ పుట్టారు. ఆయన ఏం చదువుకోలేదు. కొన్నాళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోయారు. ఓ విద్యాధికుడిగా తిరిగొచ్చారు. ఆయన కూడా అల్లూరి సీతారామరాజులానే స్వాతంత్య్ర పోరాటం చేశారు. అలా దాదాపు ఒకేసారి పుట్టి, ఒకే సమయంలో ఇల్లు వదిలి వెళ్లిపోయి, తిరిగొచ్చి ఒకే రీతిలో పోరాటం చేసిన ఇద్దరు తెలుగు వీరులు వీరిద్దరూ. వీరిద్దరి కథ నన్ను చాలా ఆకర్షించింది. ఇంటికి దూరంగా వెళ్లిపోయిన వీళ్లు ఇద్దరూ కలిస్తే.. స్నేహితులుగా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచనే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. చరణ్‌ యుక్త వయసు అల్లూరి సీతారామరాజులా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కొమరం పాత్ర పోషిస్తారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీతగా కనిపించనుంది’’ అన్నారు రాజమౌళి.

బడ్జెట్‌ ఎంత?

రాజమౌళి ఆలోచనలు, కథలు అన్నీ భారీస్థాయిలోనే ఉంటాయి. ‘బాహుబలి’ బడ్జెట్‌ విన్నప్పుడు దక్షిణాది చిత్రసీమ మొత్తం నివ్వెరపోయింది. అయితే దానికి తగ్గట్టే భారీ వసూళ్లు అందుకుంది. ఇప్పుడు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కూడా అలానే ఉండబోతోంది. ఈ చిత్రాన్ని రూ.350 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌లో రూపొందించబోతున్నట్టు నిర్మాత డి.వి.వి దానయ్య తెలిపారు. ‘రాజమౌళితో సినిమా చేయడమే ఓ అదృష్టం. అందుకే బడ్జెట్‌ గురించి ఆలోచించడం లేదు. ఏ విషయంలోనూ  రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’ అన్నారాయన. అయితే ‘ఈ సినిమాని వదిలేసి మాకు అప్పగిస్తే.. రూ.వంద కోట్లు ఇస్తాం’ అంటూ కొంతమంది నిర్మాతలు దానయ్యని సంప్రదించారట. దానికి దానయ్య అంగీకరించలేదట. ఈ విషయాన్ని దానయ్యే స్వయంగా ప్రస్తావించారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయని, త్వరలో అహ్మదాబాద్‌, పుణెల్లో 30 రోజుల పాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామని తెలిపారు. 2020 జనవరి నాటికి చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తరవాత నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలెడతారు.

చరణ్‌తో స్నేహం ఇలానే ఉండాలి

క్కన్నతో నాలుగోసారి పనిచేయడం, చరణ్‌తో కలసి నటించడం ఆనందంగా ఉంది. నా కష్టసుఖాల్ని పంచుకునేంత స్నేహం చరణ్‌తో ఉంది. మేం ఇలానే స్నేహితులుగా ఉండాలి. బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెబుతుంది. ఆ దిష్టి మాకు తగలకూడదు. అల్లూరి, కొమరం భీమ్‌.. ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు కలసి ఉంటే ఏం జరిగేదన్నది అద్భుతమైన ఆలోచన. నటులుగా మాకది కొత్తగా కనిపించింది. ఇప్పటి వరకూ నేను నటించిన 28 సినిమాల కంటే ఈ సినిమాతో ఎక్కువ నేర్చుకుంటున్నా. అడిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, భేషజాలకు పోకుండా ఈ సినిమా ఒప్పుకున్న చరణ్‌కు హ్యాట్సాఫ్‌. మా తరంలో ఇలా జరగడానికి కారణం జక్కన్నపై, మా స్నేహంపై ఉన్న నమ్మకమే.

తారక్‌ ఇక్కడున్నాడేంటి అనుకున్నా

రోజు ఎయిర్‌ పోర్టుకి వెళ్తుంటే రాజమౌళి గారి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఓసారి ఇంటికొచ్చి వెళ్లు’ అన్నారు. వెళ్తే అక్కడ తారక్‌ కనిపించాడు. ‘తారక్‌ ఏంటి? ఇక్కడున్నాడు’ అనుకున్నా. ‘మీరేమైనా మాట్లాడుకుంటున్నారేమో.. నేను తరవాత వస్తా..’ అని బయటకు వెళ్లబోయా. కానీ.. నన్నూ, తారక్‌నీ రాజమౌళి లోపలకు తీసుకెళ్లి.. ఈ సినిమా ఐడియా చెప్పారు. వెంటనే కౌగిలించుకుని ‘థ్యాంక్స్‌’ చెప్పా. చిత్రసీమలో నాకున్న ఏకైక మిత్రుడు ఎన్టీఆర్‌. నా మనసుకి దగ్గరైన వ్యక్తి. సోదరుడు తారక్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

 

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.