BiggBoss Telugu 5: కెప్టెన్‌గా జస్వంత్‌.. ప్రేమకథలు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్‌ - telugu news biggboss latest episode
close
Updated : 24/09/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BiggBoss Telugu 5: కెప్టెన్‌గా జస్వంత్‌.. ప్రేమకథలు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్‌

హైదరాబాద్‌: కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. కంటెస్టెంట్స్‌ మధ్య ఓ వైపు స్నేహబంధాలు, మరోవైపు హోరాహోరీ మాటల యుద్ధాలతో ఇటీవల ప్రారంభమైన ‘సీజన్‌-5’ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో అలరిస్తోంది. తాజాగా నాలుగోవారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్‌ హోరాహోరీగా సాగింది. ‘అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి’ టాస్క్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఇంటి సభ్యులను ఎన్నుకోవాలని బిగ్‌బాస్‌ సూచించాడు. ‘అమెరికా అబ్బాయి’ టీమ్‌ నుంచి శ్రీరామచంద్ర, ‘ఆంధ్రా అమ్మాయి’ టీమ్‌ నుంచి జస్వంత్‌, ఇతర సభ్యుల నుంచి శ్వేతావర్మ పోటీదారులుగా ఎంపిక కాగా, సీక్రెట్‌ టాస్క్‌ గెలిచిన రవి నేరుగా కెప్టెన్ బరిలో నిలుచాడు. ఈ నలుగురికి ‘లెటర్‌ పెట్టు.. కెప్టెన్‌ బ్యాండ్‌ పట్టు’ అనే పోటీ నిర్వహించగా.. జస్వంత్‌ విజేతగా నిలిచి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా షణ్ముఖ్‌ను రేషన్‌ మేనేజర్‌గా జస్వంత్‌ ఎంపిక చేశాడు.

‘తనతో సరిగ్గా ఉండటం లేదంటూ షణ్ముఖ్‌ నాపై ఆరోపణలు చేస్తున్నాడు’ అని సిరి.. కాజల్‌, లోబోల ఎదుట వాపోయింది. అంతేకాకుండా.. షణ్ముఖ్‌తో మాట్లాడాలనుకున్నప్పుడల్లా.. అతను వేరే హౌస్‌మేట్స్‌తో బిజీగా ఉంటున్నాడని చెప్పి బాధపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కొత్త కెప్టెన్‌ జస్వంత్‌.. సిరి-షణ్ముఖ్‌ల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాడు. అనంతరం, తొలిప్రేమ అనుభవాలు తెలియజేయాలని.. తమ మనసుకి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి పేరుని బెలూన్‌పై రాసి గాల్లోకి ఎగురవేయాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు సూచించాడు. దీంతో షణ్ముఖ్‌, సిరి, ప్రియాంక, రవి, అనీ మాస్టర్‌ తమ ప్రేమ కథల గురించి ఇలా చెప్పుకొచ్చారు..

‘నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు నా క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాను. అప్పటి నుంచి టీనేజీ వరకూ ఆమెను ఇష్టంగా ప్రేమించాను’ అని తన తొలి ప్రేమకథను బయటపెట్టాడు షణ్ముఖ్‌. అంతేకాకుండా తన ప్రియురాలు దీప్తికి ఈ విషయం తెలుసని అన్నాడు.

సిరి తన ప్రేమ కథను చెబుతూ కన్నీటి పర్యంతమైంది. తనని ప్రేమించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంది. సిరి కథతో ఇంటి సభ్యుల కళ్లు చెమర్చాయి.

తాను రవి అనే అబ్బాయిని ఇష్టపడ్డానని.. కొంతకాలంపాటు రిలేషన్‌లో ఉన్నానని ప్రియాంక చెప్పింది. పెళ్లి చేసుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాక.. తాను ట్రాన్స్‌జెండర్‌గా మారానని.. ఈ క్రమంలోనే తాను కొంతకాలంపాటు రవికి దూరంగా ఉండాల్సి వచ్చిందని.. దీంతో అతను ఇంట్లో వాళ్లు చూపించిన పెళ్లి చేసుకున్నాడని చెప్పిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత అతన్ని కలిసి పెళ్లి చేసుకుందామని అడగ్గా.. ‘నువ్వు పిల్లల్ని కనగలవా?’ అంటూ హేళనగా మాట్లాడి తనని మానసికంగా వేధించాడని కన్నీరు పెట్టుకుంది. తాను తల్లి అయ్యేందుకు వైద్యపరంగా లక్షలు ఖర్చు చేశానని.. ప్రయోజనం లేకుండా పోయిందని.. ప్రియాంక భోరున విలపించింది.

తన సతీమణి నిత్యతో ఎలా పరిచయమైంది? ఏ విధంగా తమ పెళ్లి జరిగింది? అనే విషయాలను రవి వివరించాడు.

మొదటి నుంచి తనకి ప్రేమ అంటే ఆసక్తి లేదని.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేసేవాడినని నటరాజ్‌ మాస్టర్‌ చెప్పారు. ఈ క్రమంలోనే తనకి పెళ్లైందని.. జీవిత భాగస్వామి ఎంతో బాగా చూసుకుంటోందని.. ఆమె చూపించిన ప్రేమకు కరిగిపోయానని ఆయన అన్నాడు.

వ్యక్తి, వృత్తిగత జీవితంలో తన భర్త అండదండలు ఎంతగానో ఉన్నాయని అనీ మాస్టర్‌ తెలిపారు. ఆయన వల్లే తాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ చేసుకోగలుగుతున్నానని ఆమె చెప్పారు. ‘ఎక్కడికి వెళ్లావు? ఎప్పుడు వస్తున్నావ్‌? ఏ షూటింగ్స్‌కి వెళ్తున్నావ్? ఇంట్లో ఉండాల్సిన పనిలేదా?’ ఇలాంటి ప్రశ్నలు ఒక్కరోజు కూడా తనని అడగలేదని అని ఆమె వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని