Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - telugu top ten news at nine pm
close
Published : 25/09/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

తుపాను తీరం దాటాక భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందున.. తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం ఆరా తీశారు.  గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సచివాలయాల వారీగా అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

2. పేరు చివర ‘రెడ్డి’ పెట్టుకునే సంప్రదాయం కొనసాగించండి: పోచారం

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన రెడ్ల ఆత్మీయ సభకు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘నేను సభాపతి హోదాలో ఈ సభకు రాలేదు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిగానే మా బంధువులను కలవడానికి వచ్చాను. నాలుగు ముచ్చట్లు వాళ్లతో మాట్లాడదామని వచ్చాను. ఇటీవల కొందరు పేర్ల చివర రెడ్డి అని పెట్టుకోవడానికి భయపడుతున్నారు. మన సంప్రదాయం నిలబెట్టే విధంగా ఆ పేరు దగ్గర రెడ్డి అని తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. అది మన హక్కు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. 

3. హైదరాబాద్‌లో భారీ వర్షం... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌లో భారీ వర్షం కురిస్తోంది. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.  సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

4. వైకాపా నేతల ఒత్తిడి.. రిటర్నింగ్‌ అధికారి కంటతడి

చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైకాపా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే రోజా-చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. నిండ్రలో నిన్న జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడగా ఆధిపత్యం కోసం ఇరువర్గాలు పోటాపోటీగా వ్యవహరించాయి. వైకాపా వర్గాల ఒత్తిడితో రిటర్నింగ్ అధికారి కంటతడి పెట్టుకున్నారు. 

5. ఏపీ మంత్రి వర్గంలో త్వరలో భారీ మార్పులు: బాలినేని

ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పానని బాలినేని స్పష్టం చేశారు. ‘‘ మంత్రి పదవి పోయినా నేను భయపడను. నాకు పార్టీ ముఖ్యం, పదవులు కాదు’’ అని పేర్కొన్నారు.

6. తొలి డీఎన్‌ఏ టీకా భారత్‌దే: ఐరాసలో ప్రధాని మోదీ

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత దేశ అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని తెలిపారు. భారత్‌ తెచ్చిన సంస్కరణలు ప్రపంచాన్ని మారుస్తాయని చెప్పారు. వైవిధ్యమే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా మార్చిందన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్‌ను మాతగా అభివర్ణించారు. ప్రపంచానికి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందించిన తొలి దేశం భారత్‌ అని మోదీ చెప్పారు. 

పెరిగిన ప్రధాని మోదీ ఆస్తుల విలువ

7. నోరి దత్తాత్రేయుడి జీవితం మూర్తీభవించిన మానవత్వానికి నిదర్శనం

డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడి స్వీయ ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ పుస్తకావిష్కరణకు స్వయంగా తాను హాజరుకాలేకపోతున్నందుకు చింతిస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు.

8. మీడియాపై ఉక్కుపాదం.. సంస్థలపై ‘11 నియమాలు’

అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం మహిళల స్వేచ్ఛను హరించి వేసిన తాలిబన్లు.. వార్తా సంస్థలపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. మీడియా స్వేచ్ఛను అణచివేసేలా.. ‘11 నియమాలు’ పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. మతానికి విరుద్ధంగా, ప్రభుత్వ పెద్దలను అవమానపరిచే కంటెంట్‌ను ప్రచురించకుండా ఉండేందుకు తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. 

9. ఎవరైనా వాహన సామర్థ్య పరీక్ష కేంద్రాలు పెట్టొచ్చు!

వాహన సామర్థ్య పరీక్షలు నిర్వహించే ‘ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌)’ల ఏర్పాటుపై కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ వంటి ప్రత్యేక సంస్థలు, అసోసియేషన్లు, కొంతమంది వ్యక్తుల బృందం లేదా ఒకే వ్యక్తి.. ఇలా ఎవరైనా ఏటీఎస్‌ ప్రారంభించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. 

10. సంజూ రాణించినా.. రాజస్థాన్‌కు ఓటమి

దిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌కి దాదాపుగా చేరింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని