మరియమ్మ లాకప్‌డెత్‌ కేసు.. ముగ్గురిపై వేటు

తాజా వార్తలు

Published : 22/07/2021 10:12 IST

మరియమ్మ లాకప్‌డెత్‌ కేసు.. ముగ్గురిపై వేటు

ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించిన అధికారులు  

అడ్డగూడూరు, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో దళిత మహిళ లాకప్‌డెత్‌ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మను జూన్‌ 18న రూ. 2 లక్షల దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను విచారించి రూ. 1.35 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుల కోసం మరియమ్మను ఠాణాకు పిలిపించి ప్రశ్నించారు. విచారణ సమయంలో ఆమె స్పృహ కోల్పోవడంతో పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారు. తర్వాత భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలకలం రేగింది. పోలీసులు కొట్టడం వల్లే మరియమ్మ మృతిచెందినట్లు ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, వివిధ పార్టీలు, దళిత, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావును విచారణ అధికారిగా నియమించారు. లోతుగా విచారించగా.. నిబంధనలకు విరుద్ధంగా పోలీసు సిబ్బంది ఆమెపై చేయి చేసుకున్నారని, స్పృహ తప్పిపడిపోయిన ఆమెకు సత్వరం వైద్య సదుపాయం కల్పించడంలో కూడా నిరక్ష్యంగా వ్యవహరించారని తేలినట్లు సమాచారం. ఏసీపీ నివేదిక ఆధారంగా ఎస్‌ఐ వి.మహేశ్వర్‌, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్‌, పి.జానయ్యను విధుల నుంచి తొలగిస్తూ రాచకొండ సీపీ మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించారు. ఉద్వాసనకు గురైన పోలీసులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని