close

ప్రధానాంశాలు

Updated : 07/03/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సన్నబడతారంటూ స్కీం... రూ.1,500 కోట్ల స్కాం

‘గొలుసుకట్టు’ దందాలో 10 లక్షల మంది బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల పేరుతో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు తెరలేపి ఏడేళ్లలో రూ.1,500 కోట్లు కొల్లగొట్టిన ఇండస్‌ వివా సంస్థ నిర్వాహకులు అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌తో సహా 24 మంది నేరస్థులను సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఇందులో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులూ ఉన్నారు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఇండస్‌ వివా సంస్థ సదస్సు నిర్వహిస్తోందని తెలుసుకుని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ దేశవిదేశాల్లో 10 లక్షల మందిని మోసం చేసిన ఈ సంస్థ నేరాల తీరును సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల ఖాతాల్లోని రూ.20 కోట్ల నగదును స్తంభింపజేశామన్నారు.
సంతానం కలుగుతుందంటూ..
‘బెంగళూరుకు చెందిన అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌తో కలిసి ఏడేళ్లక్రితం బెంగళూరులో ఇండస్‌ వివా హెల్త్‌సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ప్రారంభించారు. ఐ-పల్స్‌, ఐ-గ్లో, ఐ-స్లిమ్‌, ఐ-కాఫీ పేరుతో సహజసిద్ధ, ఆయుర్వేద సంరక్షణ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. సంతానం లేని వారికి తమ ఉత్పత్తుల ద్వారా పిల్లలు పుడతారని, లావుగా ఉన్నవారు సన్నబడతారంటూ కర్ణాటక, ఏపీ, తెలంగాణల్లో ప్రచారం చేశారు.
గొలుసుకట్టులో చేర్పిస్తే లాభాలు.. విదేశీ పర్యటనలు
ఇండస్‌ వివాలో రూ.12,500 కడితే సభ్యత్వం ఇస్తారు. భర్త సభ్యుడైతే భార్య కూడా సభ్యురాలైనట్లే. వీరు ఒకరిని చేర్పిస్తే వంద పాయింట్లు ఇస్తారు. ధనికులను ఆకర్షించేందుకు రూ.1.50 లక్షల సభ్యత్వాన్నీ ప్రవేశపెట్టారు. నగదుతో పాటు బెంజి కార్లు ఇచ్చేవారు. మలేసియా, మకావ్‌ దీవులు, అమెరికా పర్యటనలకు పంపించేవారు.
మార్కెటింగ్‌లో రూ.లక్షల ఆదాయం
ఇండస్‌ వివా ప్రచారంతో ఆకర్షితులైన వారిలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. యాదగిరిగుట్టలోని ములుగు వెంకటేశ్‌, ఖమ్మం నివాసి కాసాని శేషారావు, మిర్యాలగూడకు చెందిన మన్నెపు హరిప్రసాద్‌లు సభ్యులుగా చేరారు. వీరు తమ బంధువులు, పరిచయమున్న వారందరినీ ఇందులో చేర్పించారు. పాఠశాలకు సెలవుపెట్టి వివా సంస్థ ఉత్పత్తుల అమ్మకాల్లో నిమగ్నమయ్యారు. నెలకు ఒక్కొక్కరు రూ.10 లక్షలు సంపాదించే స్థాయికి చేరుకున్నారు. ఈ కేసులో నిందితులవడంతో వీరితో పాటు వీరి భార్యలు నాగదేవి, నాగలక్ష్మి, మన్నెపు రేణుకలూ అరెస్టయ్యారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ ద్వారా దేశ ప్రజలందరినీ మోసం చేయాలని ఇండస్‌ వివా సంస్థ నిర్వాహకులు ప్రణాళిక సిద్ధం చేశారు’ అని సజ్జనార్‌ వివరించారు. గొలుసుకట్టు పద్ధతిలో సభ్యులు చేరితే పదకొండో స్థాయిలో మనదేశంలో ప్రజలందరూ, 12వ స్థాయిలో ఆసియా ఖండమంతా, 13వ స్థాయిలో ప్రపంచ జనాభా మొత్తం ఇండస్‌ వివా సభ్యులవ్వాలని వారు ప్రణాళికలు వేశారన్నారు. ప్రజలు వీరిబారిన పడకుండా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన