
దుర్గగుడి ఈవోగా భ్రమరాంబ బాధ్యతల స్వీకరణ
ఇంద్రకీలాద్రి: విజయవాడ దుర్గ గుడి ఈవోగా డి.భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈవోగా ఉన్న ఎంవీ సురేశ్‌బాబును ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆయన స్థానంలోకి భ్రమరాంబ వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కనకదుర్గ అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. భ్రమరాంబ ఇప్పటి వరకు రాజమహేంద్రవరంలో దేవాదాయశాఖ ఆర్జేసీగా విధులు నిర్వహించారు. సురేశ్‌బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
సురేష్‌బాబు దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆలయానికి చెందిన శానిటేషన్, సెక్యూరిటీ సహా ప్రధాన టెండర్ల విషయంలో పక్షపాత ధోరణి, వెండి సింహాల చోరీ, ఆలయంలోని ఉద్యోగులతో సఖ్యత లేకపోవడం, ప్రతి విభాగంలోనూ పెరిగిపోయిన అవకతవకలు, పరిపాలన విభాగంపై పట్టులేకపోవడం.. వంటి అనేక వివాదాలు ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన్ను వెంటాడాయి. తాజాగా ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలతో సురేష్‌బాబు హయాంలో జరిగిన అవకతవకలు, వివాదాలు వెలుగుచూశాయి. దీనిపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఆయన బదిలీ జరిగింది.