Published : 21/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుట్టుగా క్రికెట్‌ బెట్టింగ్‌


స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌, చరవాణులతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌దారులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పటమట దర్శిపేటకు చెందిన తొంట్ల సత్యనారాయణరెడ్డి ప్రధాన సూత్రధారి. హైదరాబాద్‌కు చెందిన ఐనంపూడి కిరణ్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ లింక్‌ తీసుకున్నాడు. దర్శిపేటలో ఒక రేకుల షెడ్‌ అద్దెకు తీసుకున్నాడు. యనమలకుదురుకు చెందిన కాకానీ బాజీబాబుకు 10 శాతం కమీషన్‌ ఇచ్చి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. పటమటకు చెందిన సానే ఓబుల్‌నాయుడు లైన్‌ ద్వారా ఫోన్‌ నెంబర్లు రిసీవ్‌ చేసుకుంటారు. డేగల వేణు ల్యాప్‌టాప్‌కు చరవాణులు అమర్చి, ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తారు. మాణిక్యాలరావు, వెనగళ్ల శివరామకృష్ణ, కొమ్మా శివబాలకృష్ణ, శేషం శ్రీనివాసులు, రెడ్డి మణికొండ, బీర్ల సాంబశివరావు, అరిగేపూడి మణికంఠచౌదరి అనే వారి సాయంతో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగే దీనిపై టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ డాక్టర్‌ కె.వి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు ఏసీపీలు రమణమూర్తి, వి.ఎస్‌.ఎన్‌.వర్మలు తమ సిబ్బందితో దాడులు చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌, నగదు లావాదేవీల పుస్తకం, 11 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం పటమట పోలీసులకు అప్పగించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఐనంపూడి కిరణ్‌ను పట్టుకోవాల్సి ఉంది. బెట్టింగ్‌ రాకెట్‌ను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను సీపీ బి.శ్రీనివాసులు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని