రూ.కోటి విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం 14 గోదాముల్లో సరకు, గంజాయి, నగదు సీజ్‌
logo
Published : 18/06/2021 02:38 IST

రూ.కోటి విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం 14 గోదాముల్లో సరకు, గంజాయి, నగదు సీజ్‌

గుట్కా ప్యాకెట్లను పరిశీలిస్తున్న వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్‌
ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: విజయవాడ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న రెండు ఏజెన్సీలకు సంబంధించిన వేర్వేరు గోదాములపై పోలీసులు దాడి చేసి రూ.కోటి విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 10 కిలోల గంజాయి, రూ.5.15లక్షల నగదు గోదాముల్లో లభ్యమైంది. వన్‌టౌన్‌ మెయిన్‌ బజార్‌లో చంద్రిక ఏజెన్సీస్‌, సాయిరెడ్డి ఏజెన్సీస్‌కు సంబంధించిన గోదాముల్లో గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు టాస్కుఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏడీసీపీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో టాస్కుఫోర్స్‌ పోలీసులు, వన్‌టౌన్‌ పోలీసులు సంయుక్తంగా బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా విడిపోయి రెవెన్యూ, ఫుడ్‌సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. చంద్రికా ఏజెన్సీస్‌ నిర్వాహకులు చంద్రికారెడ్డికి చెందిన 11 గోదాముల్లో రూ.53.16 లక్షల విలువైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు, రూ.9.70 లక్షలు విలువచేసే నిషేధిత సిగరెట్లు, ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాయిరెడ్డి ఏజెన్సీకు సంబంధించిన మూడు గోదాములను తనిఖీ చేయగా రూ.38.25లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు, రూ.5.15 విలువ చేసే సిగరెట్లు, నాలుగు కిలోల గంజాయి, రూ.5.15లక్షల నగదు లభ్యమైంది. మొత్తం 14 గోదాములను సరకుతో సహా సీజ్‌ చేశారు. డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో టాస్కుఫోర్సు ఏసీపీ వర్మ, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, టాస్కుఫోర్స్‌ సీఐ కృష్ణమోహన్‌ దాడుల్లో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని