దుకాణాల అద్దె వసూలుకు చర్యలు
logo
Published : 18/06/2021 02:56 IST

దుకాణాల అద్దె వసూలుకు చర్యలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో దుకాణ సముదాయాల్లో అద్దెల వసూళ్లకు జిల్లాపరిషత్తు అధికారులు చర్యలు చేపట్టారు. దుకాణాలను తీసుకుని నెల వారీగా అద్దెలు చెల్లించని వారికి తొలుత తాఖీదులు ఇచ్చారు. కొందరు స్పందించి అద్దె బకాయిలు చెల్లించేందుకు ముందుకు రాగా.. ఎక్కువ మంది పట్టించుకోలేదు. దుకాణాలను పొందిన పలువురు గుత్తేదారులు బినామీలకు అద్దెకు ఇచ్చి వారి వద్ద రెండింతలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. బినామీల నుంచి అద్దె తీసుకుంటున్న గుత్తేదారులు జడ్పీకి అద్దె చెల్లించడం లేదు. దీనిని గుర్తించిన జడ్పీ అధికారులు దుకాణాలకు తాళాలు వేసి సీజ్‌ చేస్తున్నారు. ఇటీవల అచ్చంపేటలో దుకాణాల సముదాయానికి సీల్‌ వేయడంతో బకాయిలు చెల్లించేందుకు జడ్పీకి వరుస కట్టారు. అచ్చంపేట దుకాణాల సముదాయం నుంచే రూ.18 లక్షల వరకు అద్దెలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో రూ.80 లక్షల వరకు రావాల్సి ఉంది. బకాయిలు పేరుకుపోయిన దుకాణాల సముదాయాలను గుర్తించి మొండి బకాయిలను వసూలు చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలను జిల్లాపరిషత్‌ అధికారులు ఆదేశించారు. ఎంపీడీవోలు రంగప్రవేశం చేసి అద్దెలు సక్రమంగా చెల్లిస్తేనే దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని, లేకుంటే తాళాలు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో అద్దెదారులు దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని జిల్లాపరిషత్తు అధికారులకు లేఖలు రాసిస్తున్నారు. జడ్పీకి ఆదాయ వనరుల్లో కీలకమైన దుకాణాల సముదాయం అద్దెలను అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.లక్షల్లో పేరుకుపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అద్దె వసూళ్లకు చర్యలు చేపట్టామని జిల్లాపరిషత్తు సీఈవో చైతన్య ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఎంపీడీవోలను పర్యవేక్షించి బకాయిలు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని