ప్రమాదంలో యువత భవిష్యత్తు: చంద్రబాబు
logo
Published : 22/06/2021 19:45 IST

ప్రమాదంలో యువత భవిష్యత్తు: చంద్రబాబు

అమరావతి: పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనందున నిరుద్యోగ యువత భవితవ్యం ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండర్‌ విడుదల చేయటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. గ్రూప్‌-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. ఏటా రూ.లక్షలు ఖర్చుపెట్టి వివిధ రకాల శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి కల్పించే సమర్థత ఈ ప్రభుత్వానికి లేకపోవటంతో యువజన, విద్యార్థి సంఘాలు.. జగన్‌ వైఫల్యాలను నిలదీస్తున్నాయన్నారు.

పది, ఇంటర్‌ పరీక్షలను అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తే జగన్‌ మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే ఫేక్‌ ముఖ్యమంత్రి జగన్‌ అని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం మాటున అనేక అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3వేలు పింఛను ఇస్తానని ఎన్నికల ముందు మాటిచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని ఆక్షేపించారు.

సీఎం ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరగటం, రాష్ట్రంలో మహిళల భద్రతకు అద్దం పడుతోందన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించటంతో అత్యాచారాలు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్‌ హత్యలు, గంజాయి స్మగ్లింగ్‌ నిత్యకృత్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగడుతూ ఈనెల 29న 175 నియోజకవర్గాల్లో తెదేపా ఆందోళన కార్యక్రమాలను చేపడుతుందని ప్రకటించారు. సమావేశంలో సీనియర్‌ నేతలు రామానాయుడు, జీవీ ఆంజనేయులు, జ్యోతుల నెహ్రూ, అబ్దుల్‌ అజీజ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలువ శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని