కొండపల్లి అడవుల్లో పోలీస్‌ బందోబస్తు
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

కొండపల్లి అడవుల్లో పోలీస్‌ బందోబస్తు

అటవీ ప్రాంతంలో మోహరించిన పోలీసులు

కొండపల్లి, న్యూస్‌టుడే: తెదేపా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి అడవులను పరిశీలిస్తుందన్న సమాచారంతో కొండపల్లి పురపాలికతో పాటు జి.కొండూరు మండల పరిసరాల్లో పోలీసులు శనివారం భారీ బందోబస్తు నిర్వహించారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే బ్లూకోట్స్‌ టీములు ఆయా ప్రాంతాల్లో పర్యటించాయి. ఎస్సైల పర్యవేక్షణలో నాలుగు బృందాలు జాతీయ రహదార్ల వెంట, గ్రామాల ప్రధాన రహదార్లలో గస్తీ ఏర్పాటు చేశారు. తోపుడు బండ్ల వ్యాపారాలు నిర్వహించకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం రింగు సెంటర్‌ వద్దకు వచ్చిన కార్లను నిలిపి తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండపల్లి ప్రధాన వీధి, ఎర్ర వంతెన వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా గస్తీ కాశారు. కట్టుబడిపాలెం, జి.కొండూరు వైజంక్షన్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ మైనింగ్‌ జరిగిందని చెబుతున్న ప్రాంతంలో పదుల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడవికి వెళ్లేవారిని వెనక్కు పంపారు. క్వారీ నిర్వహణ నిమిత్తం వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొల్లపూడి వచ్చే వరకు బందోబస్తు నిర్వహించారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను ఎక్కడికక్కడే పోలీసులు గృహ నిర్భందం చేయడంతో కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కొండూరు ప్రాంతాలకు చెందిన తెదేపా నాయకులు అటవిలోకి వెళ్లే సాహసం చేయలేదు. దీంతో పాటు స్థానిక తెదేపా నాయకులపై కూడా పోలీసులు నిఘా ఉంచడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని