ఆ ఆదాయం వద్ధు.. ఆస్తి పన్నే ముద్దు
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

ఆ ఆదాయం వద్ధు.. ఆస్తి పన్నే ముద్దు

వసూలు కాని డీఅండ్‌ఓ లైసెన్సు పన్నులు

పాలకుల తీరుపై విపక్షాల విమర్శలు

ఈనాడు-అమరావతి

గుంటూరులో డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నుల వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, వివిధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నగరంలో సెలూన్లు మినహా ఏ వ్యాపారం నిర్వహించినా దానికి నగరపాలక నుంచి లైసెన్సు పొందాలి. దీనినే డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ అంటారు. నగరంలో ఇలాంటి అస్సెస్‌మెంట్లు 47 వేల వరకు ఉన్నాయని ఇంతకు ముందే గుర్తించారు. వాటన్నింటికి లైసెన్సులు జారీ చేసి పన్నులు వసూలు చేయాల్సిన ప్రజారోగ్య విభాగం శానిటరీ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండటం, వారి నుంచి అనధికారికంగా సొమ్ము చేసుకోవటం వంటి కారణాలతో ప్రస్తుతం 21 వేలకు మించి ట్రేడ్‌ లైసెన్సులు లేవు. అంటే మిగిలినవన్నీ లైసెన్సులు లేకుండానే కొనసాగుతున్నాయి. దీంతో కార్పొరేషన్‌ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. ప్రతి ఏటా కొత్తగా వ్యాపారాల్లోకి అడుగుపెట్టే వారి సంఖ్య భారీగా ఉంటోంది. రకరకాల షాపులు వెలుస్తున్నాయి. కానీ నగరపాలక లెక్కల్లో మాత్రం ఇవి అంతగా కనిపించటం లేదు. 2020-21లో 19,806 లైసెన్సులు ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి చాలా స్వల్పంగా పెరిగినట్లు చూపారు. కేవలం 300 కూడా పెరగలేదని స్పష్టమవుతోంది. నగరంలో 22 శానిటరీ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు కనీసం 100 లైసెన్సులు కొత్తవి జారీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినా వాటి సంఖ్య 2 వేలకు పైగా ఉంటుంది. కానీ అలా జరగటం లేదు. ఏటా వీటి పెరుగుదల 300-400కు మించి ఉండటం లేదు. మూడు మాసాల కిందట మిర్చియార్డు పరిసరాల్లో కారం మిల్లులపై పౌరసరఫరాలు, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు దాడులు చేయగా ఓ మిల్లుకు కనీసం ట్రేడ్‌లైసెన్సు లేదని వెల్లడైంది. పెద్ద మిల్లులకే లైసెన్సులు లేవంటే నగరపాలక ఏమేరకు ఆదాయాన్ని కోల్పోతుందో ఈ ఉదంతమే తెలియజేస్తోంది. విజయవాడ, విశాఖ నగరపాలకకు ఏటా రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తుండగా గుంటూరులో మాత్రం రూ.2 కోట్లకు మించి లేదు. ఇక్కడ చాలా వరకు పాత బకాయిలే ఎక్కువమొత్తంలో ఉంటున్నాయి. సగటున ఏడాదికి రూ.8-9 కోట్లు సమకూరుతోంది. అందులో 60 శాతం పాత అరియర్స్‌ ఉంటున్నాయి. రూ.కోట్లలో బకాయిలు ఉన్నా వాటి వసూళ్లకు యంత్రాంగం చర్యలు తీసుకోవటం లేదు.

నేడు ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం

నగరంలో ఉన్న నివాస, వాణిజ్య, నీటి కొళాయి అస్సెస్‌మెంట్లకు పక్కాగా పన్నులు విధించి వసూళ్లకు చర్యలు తీసుకుంటే నగరపాలకకు బోలెడు ఆదాయం వస్తుంది. దాన్ని విస్మరించి పన్ను రుసుములు పెంచి ఆదాయం పెంచుకోవాలనుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆస్తి మూల విలువపై పన్ను విధించాలనే నూతన విధానానికి ప్రజలతో పాటు విపక్షాలు, పన్ను చెల్లింపుదారుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా నగరపాలకవర్గం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, దానికి ఆమోదం పొందడానికి సోమవారం ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. నగరపాలక తీరును వ్యతిరేకిస్తూ ప్రత్యేక కౌన్సిల్‌ జరపకుండా అడ్డుకునేందుకు ఓ వైపు తెదేపా, జనసేన కార్పొరేటర్లు సన్నద్ధమవుతున్నారు. కౌన్సిల్‌ వెలుపల ఆందోళన నిర్వహించేందుకు వామపక్షాలు, జనసేన పార్టీలు వేర్వేరుగా కార్పొరేషన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అర్బన్‌ పోలీసు ఉన్నతాధికారులు కౌన్సిల్‌ సమావేశం ముగిసే వరకు కార్యాలయం వద్దే ఉండాలని పలువురు డీఎస్పీలు, సీఐలను ఆదేశించారు. కౌన్సిల్‌లో తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉందని పన్నులు పెంచకుండా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యపడవని పాలకులు చెబుతున్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్నులు అనేసరికి ప్రజలు రానున్న కాలంలో ఈ భారాలు ఎంతెంత మోయాల్సిఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పట్టణాల్లో ఏటా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచినప్పుడల్లా ఆస్తి మూల విలువ పెరిగి, ప్రజలపై భారం పడదా అని పన్ను చెల్లింపుదారుల సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. తామిచ్చిన అభ్యంతరాలపై ఒక సమాధానమివ్వకుండా ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం పెట్టుకుని, పన్నుల పెంపుదలకు ఆమోదం పొందాలనుకోవడం ఏమిటని పన్ను పెంపు వ్యతిరేక సంఘం నాయకుడు భారవి ప్రశ్నించారు. పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని వాకౌట్‌ చేస్తానని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని