ఇకనైనా ఆగేనా..!
eenadu telugu news
Updated : 18/09/2021 12:28 IST

ఇకనైనా ఆగేనా..!

ఈవో మారిన ప్రతిసారీ కార్యాలయం తరలింపు

రూ.50 లక్షలతో నాలుగో అంతస్తులో గదులు

ఈనాడు, అమరావతి

దుర్గగుడి ఈవో కార్యాలయం తరలింపు మరోసారి జరుగుతోంది. ఈవో మారిన ప్రతిసారి కార్యాలయం మారుతూ ఉంటుంది. తాజాగా మహామండపంలోని నాలుగో అంతస్తులో ఈవో కార్యాలయం కోసం జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50 లక్షలతో నాలుగో అంతస్తు మొత్తాన్ని వేర్వేరు గదులుగా మారుస్తున్నారు. ఈవో, ఐదుగురు ఏఈవోలు, 12 మంది సూపరింటెండెంట్‌లు, 11 మంది సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఇతర ఉద్యోగులు కలిపి.. ఆలయ పరిపాలన విభాగం సిబ్బంది 50 మంది వరకు ఉంటారు. వీళ్లందరి కోసం ప్రస్తుతం మహామండపంలో గదుల నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఈవో కొండపైన ఉంటే.. సిబ్బంది దిగువన ఉన్న జమ్మిదొడ్డి కార్యాలయంలో ఉంటున్నారు. దీనివల్ల ఆలయ పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో తాజాగా అందరూ ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఈవో కార్యాలయాన్ని శాశ్వతంగా ఉంచేలా నిర్మాణాలు చేపడితే బాగుంటుంది.

దుర్గగుడిలో బాగున్న నిర్మాణాలను తొలగించేయడం.. తిరిగి వాటి స్థానంలో మళ్లీ కట్టడం అనే సంస్కృతి దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో కొండపై ప్రధాన ఆలయ ప్రాంగణానికి ఆనుకునే ఈవో, పరిపాలన విభాగం కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండేవి. కానీ 2016లో అప్పటి తాత్కాలిక ఈవో సరైన ప్రణాళిక లేకుండా కొండపై ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించేశారు. ఈవో కార్యాలయం, పరిపాలన విభాగం సిబ్బందికి సంబంధించిన నిర్మాణాలు, అన్నదాన భవనం సహా అన్నింటినీ రాత్రికి రాత్రి పడగొట్టారు. తిరిగి కొత్తగా నిర్మిస్తామని చెప్పారు. కానీ ఒక్కటంటే ఒక్క నిర్మాణం తిరిగి కట్టలేదు. తర్వాత గత్యంతరం లేక కొండ దిగువన ఆలయానికి సమీపంలో భక్తుల కోసం ఉన్న ఏకైక సత్రాన్ని ఈవో, పరిపాలన విభాగం కార్యాలయంగా మార్చేశారు. ఆ తర్వాత వచ్చిన ఈవో సూర్యకుమారి కొండ దిగువన ఉన్న కార్యాలయం నుంచే పరిపాలన సాగించారు. ఆమె మారిన తర్వాత వచ్చిన ఈవోలు తిరిగి కొండపైకి వచ్చారు. ప్రముఖులు వస్తే కాసేపు వేచి ఉండేందుకు నిర్మించిన గదిలోనే ఈవో కార్యాలయం కొనసాగించారు. దీంతో సిబ్బంది కార్యాలయాలు దిగువన జమ్మిదొడ్డి సత్రంలో, ఈవో కొండపైన ఉండేవారు. అప్పటి నుంచి పరిపాలనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఈవో సురేష్‌బాబు వచ్చిన తర్వాత తన కార్యాలయాన్ని కొండపైన స్టోర్స్‌ పక్కన ఉండే గదిలోకి మార్చుకున్నారు. ప్రస్తుత ఈవో భ్రమరాంబ కూడా ఆ కార్యాలయంలోనే ఉన్నారు. సిబ్బంది మాత్రం కొండ దిగువన ఉంటున్నారు.

జోరుగా సాగుతున్న నిర్మాణాలు

ఒక్క ఫైల్‌ రావాలన్నా ఒకపూట..

ఈవో ఎక్కడుంటే పరిపాలన విభాగం మొత్తం అక్కడ ఉండాలి. దుర్గగుడిలో ఆ పరిస్థితి లేకపోవడంతో ఈవో ఒక ఫైల్‌ తీసుకురమ్మని చెబితే.. కింద నుంచి సదరు సిబ్బంది పైకి తేవడానికి ఒక పూట పడుతోంది. లేదంటే సిబ్బంది సీట్లో లేకపోవడం, నచ్చిన సమయానికి రావడం, ఈవో వేరేచోట ఉండడంతో సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. 2016 నుంచి కొత్తగా వచ్చిన ఈవోలంతా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తాజాగా మహామండపంలోని నాలుగో అంతస్తులో ఉన్న క్యూలైన్లను తొలగించి.. మొత్తం సిబ్బందికి, ఈవోకు కలిపి రూ.50లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ.. ఇక్కడే శాశ్వతంగా ఈవో కార్యాలయం ఉండేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తే భవిష్యత్తులో వచ్చే అధికారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

షెడ్డు కంటే తరలింపే భారం...

దుర్గగుడి ముందు భాగంలో కొండపై ఓ దాత రూ.50లక్షలతో భారీ షెడ్డు వేయించారు. తర్వాత నిర్మాణాలు తొలగించిన సమయంలో దానిని కొండ దిగువన మహా మండపం పక్కన బిగించారు. ప్రస్తుతం దానిని మళ్లీ అక్కడి నుంచి తొలగించి మరోచోటికి మారుస్తున్నారు. షెడ్డు ఉన్న స్థలంలో అన్నదాన భవనం నిర్మించనున్నారు. దీంతో షెడ్డును తొలగించి మరోచోట బిగించడానికి కనీసం రూ.15లక్షల పైనే ఖర్చు అవుతోంది. గతంలో తొలగించిన సమయంలో దాతనే ఒప్పించడంతో ఖర్చు ఆయనే భరించారు. ప్రస్తుతం దేవస్థానం డబ్బులనే వినియోగిస్తున్నారు. దేవస్థానం అధికారుల ప్రణాళిక లోపానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. షెడ్డుకు అయిన ఖర్చు కంటే దానిని తరలించడానికే ఎక్కువ అవుతోందిప్పుడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని