మిర్చి ఎగుమతి సంఘం నేతల రగడ
eenadu telugu news
Published : 18/09/2021 04:07 IST

మిర్చి ఎగుమతి సంఘం నేతల రగడ

కూలీ ధరల పెంపుపై వివాదం

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చి ఎగుమతి వ్యాపారుల మధ్య ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు కూలీ ధరల పెంపుదల కారణంగా బహిర్గతమయ్యాయి. కూలీ ధరల విషయమై ఎగుమతి సంఘాల మధ్య నెలకొన్న విభేదాలను కొలిక్కి తెచ్చేందుకు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి సమక్షంలోనే మిర్చి ఎగుమతి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. 350 మంది ట్రేడర్లు మిర్చి ఎగుమతి వ్యాపారం చేస్తుంటారు. ది ఎక్స్‌పోర్టు మర్చంట్స్‌ అసోసియేషన్‌లో 100 మంది లోపు, చిల్లీస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ఇండియాలో 100 మందికి పైగా, ఏ సంఘంతో సంబంధం లేని వారు 150 మంది వరకు ఉన్నారు. గతంలో సభ్యత్వం ఇవ్వమని అడిగితే ఎక్స్‌పోర్టు మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు అంగీకరించలేదని నాన్‌ అసోసియేషన్‌గా ఉన్న వ్యాపారులు వాపోతున్నారు. ఎగుమతుల్లో కీలక పాత్ర వహించే తమను సంప్రదించకుండా ఏకపక్షంగా కూలీ రేట్లు పెంచేసి మీరు అమలు చేయాలని సర్క్యులర్‌ పంపడం ఏమిటని చిల్లీస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ వారు ప్రశ్నించారు. రెండేళ్లకోసారి కూలీ ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తుందని ఎక్స్‌పోర్టు మర్చంట్స్‌ సంఘ నాయకులు బదులిచ్చారు. సభ్యత్వమే ఇవ్వనప్పుడు మీరు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు మేమెందుకు అంగీకరించాలని నాన్‌ అసోసియేషన్‌ ఎగుమతి వ్యాపారులు అడ్డం తిరిగారు. ఇలా ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. చివరకు ఛైర్మన్‌, కార్యదర్శి జోక్యం చేసుకుని మీలో మీరే చర్చించుకుని ప్రతి సంఘం నుంచి అయిదుగురు వంతున వస్తే సోమవారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని