కేఈబీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

కేఈబీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు

యువకుడి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు


కైలా ప్రశాంత్‌ (పాత చిత్రం)

కె.కొత్తపాలెం(మోపిదేవి), న్యూస్‌టుడే: కృష్ణా కరకట్టపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న రహదారి ప్రమాదంలో ఓ యువకుడు జలసమాధి కాగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సమీపం నుంచి మోపిదేవి మండలానికి చెందిన ఆరుగురు యువకులు స్వస్థలాలకు ఇన్నోవా కారులో బయలు దేరారు. కె.కొత్తపాలెం వద్ద మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి కేఈబీ కాల్వలోకి దూసుకుపోయి కొంత దూరం కొట్టుకుపోయింది. అందులో గాఢనిద్రలో ఉన్న కైలా ప్రశాంత్‌(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు సింహాద్రి శరత్‌ తుంటికి తీవ్ర గాయమైంది. మిగిలిన నలుగురు తురక లాల్‌ప్రశాంత్‌, కర్ర మహీంద్ర, ఉదయ్‌, రవి క్షేమంగా బయటపడ్డారు.

అయిదుగుర్ని రక్షించిన ఎస్‌ఐ శ్రీనివాస్‌

అదే సమయంలో విజయవాడ నుంచి కట్టమీదుగా వస్తున్న నాగాయలంక ఎస్‌.ఐ. శ్రీనివాస్‌ ప్రమాదాన్ని చూసి తక్షణం స్పందించారు. కాల్వ లోతుగా ఉండడంతో గ్రామస్థులను కొంతమందిని నిద్రలేపి తీసుకొచ్చి ప్రాణాలొడ్డి కారులో ఉన్నవారిని రక్షించారు. అయిదుగురు యువకుల ప్రాణాలు కాపాడి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ చొరవ, సాహసంతో అయిదుగురి ప్రాణాల్ని కాపాడగలిగామని.. ప్రశాంత్‌ మృత్యువాత పడటం కలచివేసిందని సహాయ చర్యల్లో పాల్గొన్న ఒకరైన దుట్టా శివరాజయ్య(కె.కొత్తపాలెం) తెలిపారు. మునిగిన కారుకు తాళ్లు కట్టి ట్రాక్టరుతో బయటకు తీయించారు. అగ్నిమాపక, జలవనరులశాఖ అధికారులు, పోలీసులు, గ్రామస్థుల శ్రమకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణం

మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన కైలా ఉమామహేశ్వరరావు-శివలీల దంపతుల రెండో కుమారుడు కైలా ప్రశాంత్‌. ఉమామహేశ్వరరావు మోపిదేవి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శివలీల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు. శుక్రవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు నిద్రించారు. బయటకు వెళ్లాల్సి ఉంది కారు తాళాలు తీసుకురా అని ప్రశాంత్‌ తన అన్నను పురమాయించాడు. గుట్టుచప్పుడు కాకుండా తాళం తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే ప్రశాంత్‌ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్నేహితులు అయిదుగురిని ఎక్కించుకొని కరకట్టమీదుగా ప్రయాణించి కార్యకలాపాలు పూర్తిచేసుకొని తిరుగుముఖం పట్టారు. ప్రశాంత్‌ కొంతదూరం కారు నడిపించాడు. తనకు నిద్ర వస్తోందని స్నేహితుల్లో ఒకరికి డ్రైవింగ్‌ చేయాలని చెప్పి నిద్రించాడు. ఈక్రమంలో కె.కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకొని ప్రశాంత్‌ కాల్వలో జలసమాధి అయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని