ఎంపీపీల ఎన్నికకు మార్గం సుగమం
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

ఎంపీపీల ఎన్నికకు మార్గం సుగమం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ తొలి అంకం ఆదివారం ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలో 57 మండలాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు మినహా 54 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధిక ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎన్నికలు జరిగిన 45 జడ్పీటీసీ స్థానాలను వైకాపా గెలుచుకుంది. 8 జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పోలింగ్‌కు ముందు ఓ అభ్యర్థి మరణించడంతో శావల్యాపురం జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 54 మండల పరిషత్‌ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వివేక్‌ యాదవ్‌ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందిన వారు తమ నుంచి ఎంపీపీతో పాటు ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్‌ సభ్యుడిని 24న ప్రత్యేక సమావేశంలో ఎన్నుకుంటారు. ఆ రోజు ఏవైనా కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే 25న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

నేడు జడ్పీ ఛైర్‌పర్సన్‌కు...

జిల్లాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ ఛైర్మన్‌, ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ మంగళవారం ప్రకటన విడుదల చేయనున్నారు. 25న ప్రత్యేక సమావేశం నిర్వహించి జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన వారు ఛైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్‌లను తమలో నుంచి ఎన్నుకుంటారు. కో-ఆప్షన్‌ రెండు స్థానాలకూ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ రోజు వీలు కాకపోతే 26న ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతిపక్ష తెదేపా, ఇతర పార్టీలు కనీస సీట్లను కూడా సాధించకపోవడంతో పరిషత్‌ పాలకవర్గాల్లో వైకాపాకు చెందిన వారు కొలువు దీరనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని