‘తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో డబ్బులు పంచారు’
eenadu telugu news
Published : 26/09/2021 04:21 IST

‘తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో డబ్బులు పంచారు’

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో తెదేపా నాయకులు డబ్బులు పంపిణీ చేశారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య ఆరోపించారు. శనివారం జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని స్థానిక తెదేపా నాయకులు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు పంపిణీ చేశారన్నారు. కొందరు తిరస్కరించడంతో పాఠశాల హెచ్‌ఎం 21 మంది విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి బలవంతం చేసి టీసీలు ఇచ్చారని విమర్శించారు. మొత్తం 45 మంది విద్యార్థులు ఉంటే 21 మందికి టీసీలు ఇవ్వడంతో చిన్నారులు గ్రామానికి దూరంగా ఉన్న పొరుగు గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి హెచ్‌ఎం, ఎంఈవోలు విద్యార్థులకు టీసీలు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌, డీఈవో గంగాభవానికి ఫిర్యాదు చేశామన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీఈవో హామీ ఇచ్చారన్నారు. తమ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని విద్యార్థుల తల్లులు కల్పన, ఝాన్సీ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని