తిరుగు ప్రయాణంలో రద్దీ
eenadu telugu news
Published : 18/10/2021 04:30 IST

తిరుగు ప్రయాణంలో రద్దీ

ఈనాడు, అమరావతి

దసరా పండగ సీజన్‌లో అనూహ్యంగా తిరుగు ప్రయాణాల రద్దీ కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. పండగ ముందు వరకు పెద్దగా డిమాండ్‌ లేదు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య దసరా నుంచి భారీగా పెరగడం కూడా కారణమని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పండగ సెలవుల అనంతరం ఎక్కువ మంది ఆదివారం బయలుదేరారు. ఈ నేపథ్యంలో విజయవాడ పీఎన్‌బీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. అంతకు ముందు కంటే ఈ సంఖ్య గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది. రెగ్యులర్‌ బస్సులతో పాటు స్పెషల్స్‌ కూడా రద్దీగానే కనిపించాయి. చివరి రోజులలో ప్రయాణికులు పెరగడంతో ఆర్టీసీ అధికారుల్లో ఆశలు నింపాయి.

● ప్రత్యేక బస్సులకు గురువారం నుంచి డిమాండ్‌ నెలకొంది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అమ్మవారి దర్శనార్థం వచ్చే వారి సంఖ్య పెరగడంతో 14న 65 సర్వీసులు నడిపారు. క్రమంగా వీటి సంఖ్య పెరిగింది. శుక్రవారం ఈ సంఖ్య 80కి చేరింది. శనివారం రద్దీ విపరీతంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఏకంగా 178 ప్రత్యేక బస్సులు తిప్పారు. వీటిలో ఎక్కువగా రాజమహేంద్రవరం 137, విశాఖపట్నం 39 నడిచాయి. దీనికి కొనసాగింపుగా ఆదివారం కూడా ఎక్కువ బస్సులు తిప్పారు. భక్తులతో పాటు సెలవుల అనంతరం తిరిగి స్వస్థలాలకు వెళ్లే వారితో పీఎన్‌బీఎస్‌ కిటకిటలాడింది. సాయంత్రం 6 గంటల వరకు 54 ప్రత్యేక సర్వీసులు తిప్పారు. అర్ధరాత్రి వరకు డిమాండ్‌ ఉన్న మార్గాల్లో బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ రూట్‌లో కూడా రద్దీ నెలకొంది. ఊళ్లకు వెళ్లే సమయంలో కంటే రిజర్వేషన్లు కూడా తిరుగు ప్రయాణాలకు పెరిగాయి. ఈ సీజన్‌లో గత ఏడాది కంటే ఆదాయం పెరుగుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని