కమిటీలు కొలువుదీరేనా..?
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

కమిటీలు కొలువుదీరేనా..?

ఆరోగ్య కేంద్రాల్లో కుంటుపడిన అభివృద్ధి

మౌలిక వసతులు లేక రోగులకు తప్పని తిప్పలు

న్యూస్‌టుడే, చల్లపల్లి గ్రామీణం, అవనిగడ్డ గ్రామీణం


కొవిడ్‌ వైద్య సేవల్లో అధికారులతో సిబ్బంది

* మోపిదేవి పీహెచ్‌సీ ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండింది. విషసర్పాలు సంచరిస్తున్నాయి. వాటిని తొలగించాలంటే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ తీర్మానించాలి. రూ.70 వేలకుపైగా నిధులు అందుబాటులో ఉన్నాయని వైద్యుడు పర్వేజ్‌ హైదర్‌ తెలిపారు. కమిటీ లేకపోవడంతో ఆ నిధుల్ని వినియోగించలేకపోతున్నారు.

* పెదకళ్లేపల్లి పీహెచ్‌సీలో 2019, 2020 సంవత్సరాల్లో వచ్చిన రూ.3 లక్షలు ఖర్చు కాలేదు. ఈ మొత్తం ఖాతాలో నిల్వ ఉందని వైద్యాధికారి కుంభా రత్నగిరి చెప్పారు. మౌలిక వసతుల కల్పన కోసం ఉపయోగించేందుకు నిధులు అందుబాటులో ఉన్నా సద్వినియోగం కావడంలేదు.

* జిల్లాలోని చాలా వరకు పీహెచ్‌సీల ఖాతాల్లో నిధులు మూలుగుతున్నాయి. మరోవైపు మౌలిక సదుపాయాల కొరత అటు వైద్యులకు.. ఇటు రోగులకు పట్టిపీడిస్తోంది. ఆస్పత్రులకు అభివృద్ధి కమిటీలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ కమిటీల తీర్మానాలు లేక మౌలిక వసతులు సమకూరడం లేదు. కొన్ని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. భవనాలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. రోగులు కూర్చునేందుకు బల్లలు అవసరం. కొవిడ్‌ సమయంలో ఆక్సిమీటర్లు లేక ఆరోగ్య కార్యకర్తలు అవస్థలు పడ్డారు. ఆ సమయంలో అభివృద్ధి కమిటీ ఖాతాల్లో నిల్వ ఉన్న నిధుల నుంచి ఖరీదు చేసి ఇస్తే ఫలితముండేది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కమిటీలు లేకపోవడంతో మౌలిక వసతులు సమకూరడం లేదు. దీంతోపాటు చాలా ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ కమిటీలు లేక.. తీర్మానాలు చేయక అటు వైద్యాధికారులు, సిబ్బందికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 2018 ఆగస్టులో సర్పంచులు, 2019లో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ప్రజాప్రతినిధుల కమిటీలు రద్దయ్యాయి. అప్పటి నుంచి వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి అధ్యక్షతన పంచాయతీ ప్రత్యేక అధికారి, పీహెచ్‌సీ వైద్యాధికారి, మండల ప్రత్యేకాధికారి, మండల విద్యాశాఖాధికారి, ఎంపీడీవోలతో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆ కమిటీలు మూడు నెలలకోసారైన సమావేశమవ్వాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగకపోవడంతో నిధులు వినియోగానికి నోచుకోవడం లేదు.

* జిల్లాలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలో 750కి పైగా ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. అధికారులు సమావేశాలు నిర్వహించాలంటే కష్టతరంగా మారుతోంది. ప్రతి పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీకి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏటా రూ.1.75 లక్షలు కేటాయిస్తుంది. ఆ నిధులు పీహెచ్‌సీలో మౌలిక వసతులు, రోగులకు మెరుగైన సౌకర్యాలు, పరికరాలు సమకూర్చుకోవడం తదితర పనులకు ఉపయోగించవచ్ఛు ప్రజాప్రతినిధుల కమిటీలు లేకపోవడంతో అనేక పీహెచ్‌సీల్లో ఈ నిధులు ఖర్చు కావడం లేదు.

* ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచులు ఎన్నికయ్యారు. గతనెల 24న ఎంపీపీలు, 25న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీలను నియమిస్తే నిధుల వినియోగానికి అడ్డంకులు తొలగి వైద్యాధికారులకు ఉపశమనం కలుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఎంపీపీ, సర్పంచులు, పీహెచ్‌సీ వైధ్యాధికారి, ఎంపీడీవో సభ్యులుగా ఉండే అభివృద్ధి కమిటీలను వీలైనంత త్వరగా నియమించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసేలా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని