ఘనం కాదు ద్రవం..!
eenadu telugu news
Published : 18/10/2021 04:56 IST

ఘనం కాదు ద్రవం..!

రూటు మార్చి గంజాయి విక్రయాలు

ఈనాడు, అమరావతి

కొద్ది రోజుల క్రితం గుంటూరులో పట్టుకున్న ద్రవరూప గంజాయి (పాత చిత్రం)

గంజాయిని ద్రవరూపంలోకి మార్చి విక్రయాలు చేస్తున్న ముఠాలు, వ్యక్తులు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసుల పరిధిలో నిత్యకృత్యంగా పట్టుబడుతున్నారు. ఇంతకుముందు గంజాయిని పొట్లాలుగా చుట్టి విక్రయాలు చేసేవారు. ఈ క్రమంలో పోలీసులకు తెలిసిపోతోందని ప్రస్తుతం దాని విక్రేతలు రూటు మార్చి విక్రయాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కేవలం పక్షం రోజుల్లో గుంటూరు తూర్పు, దక్షిణ సబ్‌ డివిజన్‌ పోలీసుల పరిధిలో సుమారు 3 లీటర్ల గంజాయి ద్రవాన్ని స్వాధీనం చేసుకున్నారు. విక్రయాల తీవ్రతకు ఇదే నిదర్శనం. పోలీసులకు పట్టుబడుతున్న వారిలో గంజాయి విక్రేతలతో పాటు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

మెట్రోపాలిటన్‌ నగరాలకే పరిమితమైన గంజాయి, హెరాయిన్‌ వంటి మత్తుపదార్థాల విక్రయాలు మెల్లగా గుంటూరు లాంటి నగరాలకు వ్యాపించడంతో పిల్లల భవిత ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం అమరావతి రోడ్డులో ముగ్గురు యువకుల నుంచి 900 మి.లీ ద్రావకాన్ని నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు నల్లపాడు స్టేషన్‌ పరిధిలో మరో 750 మి.లీ సెబ్‌ పోలీసులకు చిక్కింది. ఈ రెండు ఘటనలకు ముందు తూర్పు సబ్‌ డివిజన్‌ పోలీసుల పరిధిలో కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి మూడు కేసుల్లో 1650 మి.లీ స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని ఉన్నతాధికారుల అనుమతితో ధ్వంసం చేశారు. ప్రస్తుతం గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసుల పరిధిలో గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్న కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటికి స్థావరాలుగా ఉన్న వడ్డేశ్వరం తదితర ప్రాంతాల్లో ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సమక్షంలో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. గుజరాత్‌లోని వడోదర, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు గుంటూరు నుంచి తరలుతోందంటే దీని మూలాలు ఏ స్థాయిలో విస్తరించాయో ఊహించుకోవచ్ఛు


పట్టుబడిన ద్రవరూప గంజాయి (పాత చిత్రం)

తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తే..

జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించడానికి విస్తారంగా కళాశాలలు ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఎక్కువగా గుంటూరు నగరానికి చేరుకుంటున్నారు. కొవిడ్‌తో కళాశాలలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల సాధ్యమైనంత వరకు ఎక్కువ సేపు వసతిగృహాలు, హోటళ్లు, గదుల్లోనే గడపాల్సి వచ్చింది. దీంతో గంజాయి తదితర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావటానికి ఇదీ ఓ కారణమని ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాహకుడొకరు విశ్లేషించారు. గుంటూరు, నరసరావుపేట, తెనాలి వంటి ప్రధాన పట్టణాల్లోనే కళాశాలలు ఉండటంతో తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు రూమ్‌లు తీసుకుని ఉంటున్నారు. దీంతో వారికి ఏ లోటు రాకూడదని అతి గారాబం చేస్తూ ఇష్టారాజ్యంగా పిల్లల చేతుల్లో డబ్బులు పెట్టేస్తున్నారు. దీంతో వారు విలాసాలకు అలవాటు పడుతున్నారని మరో అధ్యాపకుడు వివరించారు.

పోలీసులు ఏమంటున్నారంటే...

* గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య గుంటూరు నగరంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాలు పట్టుబడుతున్నాయి. తొలుత గంజాయి ముఠాలే వీటిని విక్రయించేవారు. కానీ ఇటీవల విద్యార్థులే ఒకరికొకరు సరఫరా చేసుకుంటూ దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. సులభ సంపాదనకు దీన్నో మార్గంగా కొందరు విద్యార్థులు పెట్టుకున్నారు.

* గంజాయిని పీల్చడం కన్నా ద్రవంగా చేసుకుని దాన్ని శీతలపానీయంలో కలిపి తాగితే ఆ ఆనందమే వేరని, అందుకే ద్రావకం తీసుకుంటున్నామని కొందరు విద్యార్థులు విచారణలో భాగంగా తెలియజేశారు.

* అనుమానం రాకుండా 50 ఎం.ఎల్‌, 100 ఎం.ఎల్‌ చిన్న ఆయుర్వేద సీసాల్లో నింపి విక్రయాలు సాగిస్తున్నారు. పావు లీటర్‌ రూ.10వేలు దాకా ధర పలుకుతోంది.

* తల్లిదండ్రులకు దూరంగా గడుపుతూ బ్యాచ్‌మేట్స్‌తో కలిపి గదులు, హాస్టళ్లల్లో ఉంటున్నవారే ద్రవం నిల్వలతో చిక్కుతున్నారు.

* ప్రధానంగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు పొలాలు, కొండ గుట్టల్లోకి వెళ్లి దీన్ని తాగుతున్నారు. కళాశాల యాజమాన్యాలు నిఘా ఉంచాలని, పిల్లలు తరగతులకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని