‘కేంద్ర ప్రభుత్వ వైఖరితో భవిష్యత్తులో కష్టాలు’
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

‘కేంద్ర ప్రభుత్వ వైఖరితో భవిష్యత్తులో కష్టాలు’

మాట్లాడుతున్న కృష్ణయ్య, వేదికపై ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రమాదేవి తదితరులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల వైఖరితో భవిష్యత్తులో ప్రజలకు పెను కష్టాలు ఎదురవుతాయని, ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న అనేక సంస్థలను క్రమంగా ప్రైవేటీకరించడం వారి ఆలోచనలను తెలియచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య చెప్పారు. తెనాలిలో శుక్రవారం ఆరంభమైన పార్టీ జిల్లా మహా సభల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ కేంద్రం ఆర్థిక లోటుతో ఉందని, అందుకే ఆస్తులను తాకట్టు పెడుతున్నారని, వ్యవసాయ, విద్యుత్తు రంగాలను ప్రయివేటీకరించడం వంటి తొలి దశ చర్యల ఫలితంగా మీటర్లు బిగించడం, పన్నుల పెంపు వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. దేశంలో మహిళలు, దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని, కొన్ని వర్గాలపై కావాలని విష ప్రచారం జరుగుతోందన్నారు. కేంద్రంలో భాజపాను గద్దె దించడం ద్వారా మాత్రమే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఇందుకు ప్రజాస్వామ్యవాదులందరూ కలిసికట్టుగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, హుందాతనాన్ని వీడి తిట్టుకోవడం, కొట్లాడుకోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డు పడిందన్నారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని, కౌలు రైతులకు గుర్తింపు పత్రాలిచ్చి   రుణాలు ఇప్పించాలని, పంటలకు గిట్టుబాట ధర కల్పించాలని కోరారు. ఎయిడెడ్‌ కళాశాలలను మూసివేస్తున్నందున తెనాలి, మంగళగిరి, నర్సరావుపేట, పిడుగురాళ్ల ప్రాంతాల్లో నూతన కళాశాలలు స్థాపించాలని సూచించారు. సమావేశంలో డి.రమాదేవి, బాబూరావు, శ్రీనివాసకుమార్‌, భవన్నారాయణ, అప్పారావు, మణిలాల్‌, రామారావు, శివసాంబిరెడ్డి, హుస్సేన్‌వలి, బాబూప్రసాద్‌, రాజ్యలక్ష్మి, శివశంకర్‌, వైఎల్‌.నారాయణ తదితరులు మాట్లాడారు. అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆలోచింపచేశాయి. తొలుత పార్టీ జెండాను ఎగురవేశారు. సమావేశాలు శనివారం కూడా కొనసాగనున్నాయి.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని