చిట్టితల్లీ  నీవెక్కడ..?
eenadu telugu news
Updated : 26/10/2021 05:35 IST

చిట్టితల్లీ  నీవెక్కడ..?

ఏడాదైనా దొరకని ఆచూకీ
ఈనాడు, అమరావతి- పెదకూరపాడు, న్యూస్‌టుడే

పుట్టినరోజు నాడే ఆ చిన్నారి అదృశ్యమై సరిగ్గా ఏడాది అయింది. అయినా ఆచూకీ లభించలేదు. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాప ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నారు. చిన్నారి అదృశ్యం కేసును ఛేదించాలని ప్రజా ప్రతినిధులు మొదలుకుని పలు రాజకీయ పార్టీల నేతల దాకా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినా ఫలితం లేదు. పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన మూడేళ్ల చిన్నారి పాటిబండ్ల కీర్తి అదృశ్యం కేసు పరిస్థితి ఇది.

పాటిబండ్లకు చెందిన రమేష్‌, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె కీర్తి గతేడాది అక్టోబరు 26న పుట్టినరోజున  ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. తొలుత తెలిసిన వారు ఎవరైనా తీసుకెళ్లారేమోనని భావించారు. గంటలు గడుస్తున్నా చిన్నారి ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ఊరికి వచ్చిపోయే మార్గాలన్నింటిలో ఉన్న సీసీ పుటేజీలు పరిశీలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరిగా ఆ ఊళ్లో ఉన్న పాడుబడిన బావులు, వినియోగంలో లేని చెరువుల్లో సైతం వెతికారు. అయినా ఆచూకీ, ఆనవాళ్లు లేకపోవటంతో చివరి ప్రయత్నంగా పాప ఫొటోలు తీసి రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు పంపారు. పుట్టిన రోజునే కీర్తి తప్పిపోవటం వెనక కుటుంబపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు చిన్నారి కుటుంబీకులతో పాటు వారితో వైరం ఉన్న అనేక మందిని స్వయంగా పోలీసులు విచారించారు. అయినా కేసు ఛేదించలేకపోయారు.  

టవర్లు.. ఫుటేజీలు
ఈ కేసులో పెద్దసంఖ్యలో అనుమానితులను ఇంతకు ముందే పోలీసులు పిలిచి విచారించారు. ఊరికి వచ్చిపోయే సంచారజాతుల వారిపైనా అనుమానాలు వ్యక్తం కావడంతో ఎక్కడెక్కడ ఉంటో వెతికి పట్టుకుని మరీ విచారించారు. పాటిబండ్లకు వచ్చిపోయే అన్ని గ్రామాల్లోని పుటేజీలు తీసి పరిశీలించినా ఉపయోగం లేకుండా పోయింది. మేడికొండూరు, పేరేచర్ల శివారుల్లో ఉండే సంచార జాతుల కాలనీల్లోని అనుమానితులను తీసుకువచ్చి విచారించారు. పాప అచూకీ లభ్యం కాకపోవటంతో పాప తల్లిదండ్రులు మరోసారి స్పందనలో ఇటీవల ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేయగా, సీసీఎస్‌ పోలీసుల సహకారంతో మరోసారి జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాల్లో పాప ఫోటోలతో కూడిన వాల్‌పోస్టర్లను అంటించారు. గతంలో అమృతలూరు మండలంలో ఆరేళ్ల బాబును తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన పాత నేరస్థులు అపహరించుకువెళ్లిన ఘటన నేపథ్యంలో వారికి జిల్లాతో పరిచయం ఉండటంతో విచారించడానికి ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లారు. వారు రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవిస్తున్నారని తెలుసుకుని వెనుదిరిగారు. సెల్‌టవర్ల లొకేషన్‌పై దృష్టి పెట్టి ఆప్పట్లో ఆ పాప తప్పిపోవడానికి ముందు వారం రోజులు ఆ తర్వాత వారం కాల్‌డేటాను తీసి ఎవరైనా పాత నేరస్థులు, అసాంఘికశక్తులు ఈ ప్రాంతాల్లో పర్యటించారా అనే కోణంలోనూ ఆరా తీశారు. ఇవేం ఫలించలేదు.


నేతలకు విన్నపాలు

పాప కీర్తి అదృశ్యమైన తర్వాత ఓ సారి గ్రామానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావును కలిసి తల్లిదండ్రులు కీర్తి అచూకీ కనిపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరగా స్వయంగా ఆయన ఎస్పీతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా కేసు మిస్టరీ చేధించాలని కోరారు. ఇది జరిగి కూడా ఏడెనిమిది మాసాలవుతోంది.  ఆ తర్వాత తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పాప తల్లిదండ్రులు కలిశారు. ఆయన కూడా పోలీసు అధికారులతో మాట్లాడారు. ఇలా నేతలను ఆకుటుంబీకులు కలిసి విన్నవించుకుంటూనే ఉన్నారు.


సీఎం సారూ న్యాయం చేయండి

 

పాప తప్పిపోయి ఏడాది కావస్తోంది. ఉందో?, లేదో కూడా తెలియటం లేదు. ఆచూకీ కోసం పూజలు చేయని దేవుడు లేరు. అనేకమంది నాయకులను కలిసి విన్నవించాం. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అయినా పాప కోసం రూ.రెండు లక్షలు అప్పులు తీసుకొచ్చి అనేక ఊళ్లూ తిరిగాం. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇక మావల్ల కావడం లేదు. చివరిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పుకోవాలనుకుంటున్నాం. ఆయన ఆదేశాలతో అయినా పోలీసులు ఇంకా గాలింపు చర్యలు ముమ్మరం చేసి మా బిడ్డను సజీవంగా అప్పగిస్తారని భావిస్తున్నాం.

- రమేష్‌, శ్రీలక్ష్మి (కీర్తి తల్లిదండ్రులు)


అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం

పాప అదృశ్యమైన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసుల పరంగా ఎక్కడా లోపం లేదు. అన్నికోణాల్లో విచారించాం. పిల్లలు అపహరించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచి దర్యాప్తు సాగిస్తున్నాం. ఇప్పటికీ బృందాలు తిరుగుతూనే ఉన్నాయి. అనుమానితుల ఫోన్‌ నంబర్లను తరచూ పరిశీలిస్తున్నాం. టవర్‌ లొకేషన్‌కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ను విశ్లేషిస్తున్నాం.

- పోతురాజు, డీఎస్పీ, తుళ్లూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని