Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రణాళిక ఊసేది..ప్రగతి మాటేది!

పట్టణాల్లో అమలుకాని మాస్టర్‌ప్లాన్‌

ఇరుకు రహదారులతో తప్పని అవస్థలు

అనంత నగరపాలిక, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని నగర, పురపాలికల్లో మాస్టర్‌ప్లాన్‌ అమలుకు నోచుకోవడం లేదు. పేరుకు మాత్రమే బృహత్తర ప్రణాళిక తయారు చేస్తున్నారు. అమలు చేయాల్సిన పాలకులు, అధికారులు విస్మరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన విధంగా రహదారులు విశాలంగా ఉండాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించాలి. ఎక్కడా ఆ పరిస్థితి లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతోంది.

విస్తరణ మరిచారు..

పట్టణాల్లో రాబోయే 20 ఏళ్లలో పెరిగే జనాభా, అభివృద్ధికి అనుగుణంగా బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌) రూపొందిస్తున్నారు. నగర, పురపాలక సంఘాల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలు ప్రణాళిక తయారు చేస్తున్నాయి. ప్రజల అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం కౌన్సిల్‌ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం ఆమోదించిన తరువాత మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాల్సి ఉంటుంది. నివాస, వాణిజ్య, పరిశ్రమల ప్రాంతాలుగా విభజించి, అందుకు అనుగుణంగా రహదారులు ఏర్పాటు చేయాలి. నివాస ప్రాంతాల్లో 40, వాణిజ్య ప్రాంతాల్లో 80, పరిశ్రమల ప్రాంతంలో 100 అడుగుల రహదారులు ఉండాలి. జనసందోహానికి అనువుగా ప్రధాన దారులు విస్తరించాలి. కానీ పట్టణ ప్రణాళిక అధికారులు, పాలకులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు.

రాజకీయ జోక్యంతోనే సమస్య

రాజకీయ జోక్యంతో బృహత్తర ప్రణాళిక అమలు కావడంలేదనే విమర్శలున్నాయి. పాలికల్లో పాలవర్గాలు అధికారంలో ఉన్నప్పుడు రహదారులు విస్తరించడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారులకు సంకెళ్లు వేస్తున్నారు. కొన్నిచోట్ల పాలకవర్గాలు విస్తరించడానికి ప్రయత్నించినా ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారు. విశాలమైన రహదారులే అభివృద్ధికి సూచికలు అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

● హిందూపురానికి 1989లో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. అప్పట్నుంచి నేటికీ అమలు చేయలేదు. 50 ఏళ్లుగా రహదారులు విస్తరణకు నోచుకోలేదు. గత 30 ఏళ్లలో పట్టణ జనాభా రెండింతలైంది. వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. మరోవైపు రహదారులు రోజురోజుకు కుచించుకుపోయాయి. దారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

ప్రతి ఎన్నికలోనూ రైల్వే రోడ్డును విస్తరిస్తామని హామీ ఇవ్వడం రివాజుగా మారింది. ఆ తరువాత పట్టించుకున్న పాపానపోలేదు.

ప్రణాళిక అమలుకు ప్రయత్నిస్తాం

మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన రహదారులను విస్తరించాల్సి ఉంది. నగర, పురపాలక కమిషనర్లు, పాలకమండలి తీర్మానంతో విస్తరణ చేయాలి. దీనిపై పర్యవేక్షిస్తాం. స్థానిక సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - దేవీకుమారి, పట్టణ ప్రణాళికశాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు

అనంత నగరం పాతూరులోని గాంధీ బజారు రోడ్డు ఇది. నిత్యం రద్దీగా ఉంటుంది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 80 అడుగుల రహదారి. కానీ 60 అడుగులే ఉంది. అందులోనూ తాత్కాలిక ఆక్రమణలతో రోడ్డు కుచించుకుపోయింది. ఈ మార్గంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం తలపిస్తుంది. గాంధీబజారు రోడ్డు, తిలక్‌రోడ్డును విస్తరించడానికి, ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపునకు రూ.60 కోట్లు 2018లోనే మంజూరయ్యాయి. అయితే రాజకీయ కారణాలతో విస్తరణ పనులు చేపట్టలేదు. ట్రాఫిక్‌ సమస్యతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హిందూపురంలో రైల్వే రోడ్డు ముఖ్యమైనది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 80 అడుగులు ఉండాలి. ఈ రోడ్డు ప్రారంభమయ్యే స్టేట్‌ బ్యాంక్‌ వద్ద నుంచి నంది సర్కిల్‌ వరకు ఎక్కడా 80 అడుగులు లేదు. కొన్నిచోట్ల 40, మరికొన్ని చోట్ల 20-30 అడుగులు మాత్రమే ఉంది. ఈ దారివెంట ప్రయాణించాలంటేనే పట్టణవాసులు భయపడిపోతున్నారు. ట్రాఫిక్‌ ఎంతసేపు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి.

గుత్తి పురపాలికలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రధాన రహదారులన్నీ కుచించుకుపోతున్నాయి. కొందరు రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వాసవీ బజారు ఒకప్పుడు 40 అడుగుల మేర ఉండేది. ప్రస్తుతం 20 అడుగులు కూడా లేదు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌ బజారులో లారీలు వస్తే ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. బీసీకాలనీ, కోటరోడ్డు, గుత్తి ఆర్‌.ఎస్‌.లోని కర్నూలురోడ్డు, మెయిన్‌బజారు, చంద్రప్రియనగర్‌లోని రహదారులు ఆక్రమణలకు గురయ్యాయి.

కదిరిలో ప్రధాన వ్యాపార కేంద్రం ఇక్బాల్‌రోడ్ఢు ఇక్కడ నిత్యావసర, బంగారు, వస్త్ర దుకాణాలతో పాటు కూరగాయల మార్కెట్‌ వంటివి ఉన్నాయి. ఈ రోడ్డు ఇరుకుగా ఉంది. మున్సిపాలిటీకి 2001 మే10 మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. అప్పట్లో ఇక్బాల్‌రోడ్డు వెడల్పు 40 అడుగులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇరువైపులా చేపట్టిన భవన నిర్మాణాలు పది నుంచి 15 అడుగుల మేర ముందుకొచ్చాయి. ఆక్రమణలకు తోడు దుకాణాల ముందు రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలను నిలిపేస్తున్నారు. ఫలితంగా రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఇదే పరిస్థితి పలు వీధుల్లోనూ ఉంది.

గుంతకల్లులో అన్ని రకాల వాహనాలు 22 వేల వరకు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవి అదనం. ప్రతి రోడ్డులో నిమిషానికి 130 వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అధికారుల అంచనా. తరచూ ట్రాఫిక్‌ అంతరాయం కలుగుతోంది. ఇక్కడ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి 34 ఏళ్లు గడిచింది. ప్లాన్‌ ప్రకారం రోడ్ల విస్తరణ జరగలేదు. దీంతో వాహన చోదకులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు విస్తరణకు చొరవ చూపినా.. ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని