ప్రాథమికంగా ఆరోగ్యం
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

ప్రాథమికంగా ఆరోగ్యం

● కొత్తగా 21 పీహెచ్‌సీలు

 

● ప్రతి ఆసుపత్రికి 14 మంది సిబ్బంది

ఈనాడు-తిరుపతి: గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికీ చిన్నచిన్న జబ్బులకు పట్టణ ప్రాంతాలకు వచ్చి సేవలు పొందాల్సిన పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేక పల్లె ప్రజలు వ్యయప్రయాసలకు గురవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం తాజాగా జిల్లాకు 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)ను మంజూరు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పీహెచ్‌సీకి 14 మంది సిబ్బంది నియామకానికి ఆమోదముద్ర వేసింది. మరికొద్ది రోజుల్లోనే ఆమోదం లభించిన మండలాల్లో స్థలాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జిల్లా పరిధిలో ప్రస్తుతం 101 పీహెచ్‌సీలున్నాయి. వీటితో పాటు కొన్ని సీహెచ్‌సీలున్నా ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రాథమిక వైద్యాన్ని అందించలేకపోతున్నాయి. చిన్నచిన్న జబ్బులు, గాయాలు, ఇతర అవసరాలకు ప్రజలు పెద్ద ఆసుపత్రులవైపే పరుగులు తీస్తున్నారు. దీనివల్ల ఇటు పెద్ద ఆసుపత్రులపై ఒత్తిడి పెరగడంతో పాటు బాధితుడికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలోనూ రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ కేంద్రం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఈ పరిస్థితి నెలకొందనే అంశంపై అధికారులు పరిశీలించారు. మొత్తం 21 మండలాలను గుర్తించారు. కురబలకోట, రొంపిచెర్ల, నిమ్మనపల్లి, నిండ్ర, విజయపురం, నాగలాపురం, పిచ్చాటూరు, వరదయ్యపాళెంతో పాటు ఇతర మండలాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు ఈ మండలాల్లో కొత్తగా పీహెచ్‌సీలు ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేశారు. ఒక్కో పీహెచ్‌సీకి సుమారు రూ.2.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు ఇక్కడ పనిచేసేందుకు అనుగుణంగా ఇద్దరు సివిల్‌ సర్జన్లు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు అటెండర్లతో పాటు మొత్తం 14 మందిని నియమించనున్నారు. తద్వారా స్టాఫ్‌ కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పీహెచ్‌సీలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని