‘కాపు వర్గీయులను ముఖ్యమంత్రిని చేయాలి’
eenadu telugu news
Published : 23/10/2021 02:31 IST

‘కాపు వర్గీయులను ముఖ్యమంత్రిని చేయాలి’

కాకినాడ కలెక్టరేట్‌: రాష్ట్రంలో రెండు వర్గాలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయని, ఈసారి కాపు వర్గీయులను ముఖ్యమంత్రిని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. శుక్రవారం కాకినాడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపును సీఎం చేయడానికే కాకినాడ వచ్చానని, ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీని ఒప్పిస్తానని చెప్పారు. రెండేళ్లుగా 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. దీపావళి లోపు ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని స్నేహితుడి పోర్టులో హెరాయిన్‌ పెద్ద ఎత్తున దొరికినా చర్యలు లేవన్నారు. దేశంలో ఆకలి ఎక్కువగా ఉందని, ప్రతి మేధావి నోరువిప్పి మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని