ఐటీ..వంట
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

ఐటీ..వంట

సాఫ్ట్‌వేర్‌ నిపుణులు గరిటె పట్టారు


ఫాస్ట్‌ ఫుడ్‌ తయారీలో శివ 

ఈటీవీ గుంటూరు - చిలకలూరిపేట గ్రామీణ సరదాగా నేర్చుకున్న వంట ఆ యువకుడికి సరికొత్త ఉపాధి మార్గం చూపింది. తమ ప్రాంతం వారికి విభిన్న రుచులు పరిచయం చేయాలన్న ఆలోచన ఆహారశాల ఏర్పాటుకు నాంది పలికింది. తన ఆలోచనకు స్నేహితులు కూడా తోడు రావడంతో అంతా కలిసి రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. పసందైన వంటలు వండి వారుస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన యువకులు శివ, హరీష్, ఆదిత్య నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ వెనకున్న కథ ఇది. 
కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు అన్ని రంగాలపైనా ప్రభావం చూపాయి. ఐటి రంగం ఇందుకు మినహాయింపు కాదు. పనిచేస్తున్న రంగం ఒడిదొడుకులకు లోనైతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. ఐటీ ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా మనకంటూ సొంత ఉపాధి ఉంటే బాగుంటుందని భావించారు చిలకలూరిపేటకు చెందిన శివ అతని మిత్ర బృందం. శివ, శబరీష్‌ ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మరో మిత్రుడు హరీష్‌ ఎంబీఏ చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉన్నారు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో రోజూ శివ ఇంట్లో అంతా కలిసేవారు. ఇంటికి వచ్చిన మిత్రులకు శివ సరదాగా రకరకాల ఫాస్ట్‌ ఫుడ్స్‌ చేసి పెట్టేవాడు. కబుర్లు చెప్పుకునే సమయంలోనే అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. శివకు రకరకాల వంటలు చేయటం వచ్చు. ఏదో తెలియని వ్యాపారం ఎందుకు, రెస్టారెంట్‌ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. తాము దాచుకున్న డబ్బులు, మరికొంత ఇంట్లో వారి నుంచి తీసుకోగా రూ.15 లక్షలు జమయ్యాయి. జాతీయ రహదారి పక్కనే రెస్టారెంట్‌ ప్రారంభించారు. నలుగురు మిత్రులు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే రెస్టారెంట్‌ను చూసుకుంటున్నారు. బీటెక్‌ చదివామనో, ఐటీ ఉద్యోగులమనో గొప్పలకు పోకుండా పనిని గౌరవించి అందులో విజయం సాధించారు. విభిన్నమైన ఆలోచనలకు తోడు కష్టపడే మనస్తత్వం ఉంటే ఏ పని చేసినా మంచి ఫలితాలే వస్తాయనేందుకు ఈ యువ బృందమే ప్రత్యక్ష నిదర్శనం. 

అన్ని రుచులు పరిచయం చేస్తున్నాం: శివ
మిగతా హోటళ్లకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో రెస్టారెంట్‌ ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చూశాం. నాకు వంట వచ్చు కాబట్టి ఆ పని కూడా చూస్తుంటా. తోడుగా కేరళకు చెందిన చెఫ్‌ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా లభించని రుచులను ఇక్కడ పరిచయం చేశాం. కొత్తరుచులను జనం ఆదరించారు. వ్యాపారం క్లిక్కయింది. ముఖ్యంగా యువతకు మెచ్చే వంటకాలను ఎక్కువగా సిద్ధం చేస్తున్నాం. సరదాగా మొదలుపెట్టిన వంట ఇప్పుడు వ్యాపారంగా మారడం సంతోషంగా ఉంది.   
అందరం పని చేస్తాం: శబరీష్‌
మిత్రుల్లో ఎవరికి తీరిక ఉంటే వారు రెస్టారెంట్లో ఉంటాం. క్యాష్‌ కౌంటర్లో కూర్చోవడం కాకుండా అవసరాన్ని బట్టి సర్వీసింగ్, క్లీనింగ్‌ వంటి పనుల్లోనూ చేయి వేస్తుంటాం. రుచితో పాటు శుచికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. అముల్‌ ఫ్రాంఛైజీ తీసుకుని వివిధ రకాల ఐస్‌ క్రీంలు అందుబాటులోకి తెచ్చాం. 
ముందుగా అధ్యయనం చేశాం- హరీష్‌
హోటల్‌ పెట్టడానికి ముందు ఈ వ్యాపారంలో ఉండే లోటుపాట్లు తెలుసుకున్నాం. మంచి నాణ్యతతో ఆహారం అందిస్తే వినియోగదారులు మళ్లీ మళ్లీ వస్తారు. అందుకే నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించాం. అలాగని ధరలు ఎక్కువగా ఉంటే ప్రజలు భరించటం కష్టం. అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలు అందించాలని నిర్ణయించాం. కొవిడ్‌ కారణంగా చాలామంది రెస్టారెంట్లకు రావటం లేదు. అందుకే ఆన్‌ లైన్‌ లేదా ఫోన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి కోరుకున్న ఆహారం నేరుగా డోర్‌ డెలివరీ ఇస్తున్నాం. ఈ వ్యాపారంలో సగానికి పైగా పార్శిల్స్‌ రూపంలోనే వెళ్తుంటాయి. వారసత్వంగా మాకు వేరే వ్యాపారం ఉన్నా, ఇందులో తెలియని ఆనందం ఉంది.    


శబరీష్‌... వర్క్‌ ఫ్రం రెస్టారెంట్‌   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని