ఓట్ల లెక్కింపు ప్రశాంతం
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

ఓట్ల లెక్కింపు ప్రశాంతం

 ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం


సత్తెనపల్లిలో లెక్కింపు కేంద్రం వద్ద పోలీసుల తనిఖీలు

ఈనాడు, అమరావతి : పరిషత్‌ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. తెదేపా కొద్ది మెజార్టీతో విజయం సాధించిన పలు ఎంపీటీసీ స్థానాల్లో రీకౌంటింగ్‌కు పట్టుబట్టడం, నోటాకు వచ్చిన ఓట్లు వైకాపా అభ్యర్థుల ఖాతాలో కలిపి తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టాలని పట్టుబట్టడం వంటివి ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లో వైకాపా-తెదేపా అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల మధ్య ఘర్షణకు దారి తీశాయి. వీటిపై ఆయా కేంద్రాల్లోని పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు ఎన్నికల అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలని సర్ది చెప్పారు. దీంతో అరుపులు, కేకలతో ఆగిపోయారు. చిలకలూరిపేట సీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల లెక్కింపు కేంద్రంలో మాత్రం నాదెండ్ల మండలం అప్పాపురం ఎంపీటీసీ స్థానాన్ని తెదేపా గెలుచుకోగా వైకాపా తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థి నోటా ఓట్లు కూడా కలిపి లెక్కించి తిరిగి కౌంటింగ్‌ నిర్వహించాలని కోరారు. దానికి తెదేపా ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. వైకాపా అభ్యర్థి తెదేపాకు చెందిన ఓ ఏజెంట్‌పై చేయిచేసుకోవడంతో కొంతసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైకాపా అభ్యర్థిని బయటకు తీసుకొచ్చి వివాదం మరింత రచ్చకాకుండా చూశారు. సత్తెనపల్లి, అమరావతి మండలాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

సజావుగా ప్రక్రియ: జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియను ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించింది. స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రంలోకి తీసుకొచ్చి పెట్టడం, వాటిని ఏజెంట్ల సమక్షంలో తెరవడం వంటివి ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. దీంతో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణలో ఎక్కడా అంతరాయం చోటుచేసుకోలేదు. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు సూపర్‌వైజర్లను అప్రమత్తం చేస్తూ ఓట్ల లెక్కింపునకు పాటించాల్సిన మార్గదర్శకాలను మైకులో చెప్పారు. ప్రతి పార్టీ తరఫున కౌంటింగ్‌కు అభ్యర్థులను ఆహ్వానించడం, ఒకటికి రెండుసార్లు మైకులో పిలవడం వంటివి చేసి ప్రతిఒక్కరిని భాగస్వాములను చేశారు. చివరకు అభ్యర్థులు రాకపోయినా వారికి చెందిన గెలుపు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ఫోన్లు చేసి మరీ వారిని కౌంటింగ్‌ కేంద్రానికి పిలిపించడం కనిపించింది. సకాలంలో ఓట్ల లెక్కింపునకు చర్యలు తీసుకోవడం వల్లే గంటల వ్యవధిలోనే ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయనే అభిప్రాయం వ్యక్తమైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని