అప్పుడు వరదలొస్తే ప్రాజెక్టే కట్టారు
eenadu telugu news
Published : 27/07/2021 03:16 IST

అప్పుడు వరదలొస్తే ప్రాజెక్టే కట్టారు

ఇప్పుడు కాలువలు నిర్మించలేరా?

* 1908లో మూసీకి వచ్చిన వరదలతో భవిష్యత్తులో మళ్లీ వరద సమస్య రావొద్దని ఉస్మాన్‌సాగర్‌ను నిర్మించారు.

* వాతావరణంలో వచ్చిన మార్పులతో కొంతకాలంగా నగరాల్లో కుంభవృష్టిగా వానలు పడుతూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి. కాపాడేందుకు నాలాలను ఇప్పటి పాలకులు విస్తరించలేరా? నగరాన్ని వరద ముంచెత్తినప్పుడల్లా పౌరుల నుంచి ఇదే ప్రశ్న వస్తోంది.

ఈనాడు, హైదరాబాద్‌

గండిపేట జలాశయం ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం నిండుకుండలా మారింది. మూసీకి 1908లో వచ్చిన వరదలతో హైదరాబాద్‌లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో అప్పటి పాలకులు ఉస్మాన్‌సాగర్‌ డ్యామ్‌ కట్టారు. అప్పట్లో కుంభవృష్టిగా వాన పడటంతో వరద ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తింది. అంతకుముందూ తరచూ వరదలు వచ్చేవి. వరదల నుంచి రక్షణతోపాటు తాగునీటి అవసరాల కోసం 1912లో నిర్మాణం చేపట్టి 1921 నాటికి డ్యామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో ఏటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12-24 గంటల వ్యవధిలో 18-30 సెం.మీ. వాన పడుతోంది. నగరం నీట మునుగుతోంది. వరసగా రెండేళ్లపాటు నగరాన్ని కుంభవృష్టి వానలు వణికిస్తున్నాయి. గతేడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్వకపోవడంతో ఈసారి కుండపోత వానలకు పలు కాలనీలు నీట మునిగాయి. మున్ముందు నగరాల్లో కుండపోత వానలు తప్పవని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద నివారణ ప్రణాళికలు ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొలుసుకట్టు చెరువుల్లోకి వరద నీరు వెళ్లేలా చూస్తేచాలని.. వరద కాలువల సామర్థ్యాన్ని పెంచితే సరిపోతుందని.. వాననీరు ఇంకేలా చూడాలని సూచిస్తున్నారు.

దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిందే..

వాతావరణంలో మార్పులతో నగరంలో ఒక్కోసారి అరగంటలో నాలుగైదు సెం.మీ. వాన.. కొన్నిసార్లు 2-3 గంటల్లోనే పది సెం.మీ. వర్షం కుమ్మరిస్తోంది. రహదారులపై వరద పారుతూ లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది. ప్రవాహానికి నిర్మాణాలు అడ్డురావడంతో కాలనీల్లోకి పోటెత్తుతోంది. బయటకు వెళ్లే దారి లేక తిష్ఠవేయడంతో కాలనీలు లంకలుగా మారుతున్నాయి.

1. స్పాంజ్‌ సిటీ: వర్షం కురిసినప్పుడు సాధ్యమైనంత నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. కొంత నీటిని ఒడిసిపట్టి తర్వాత ఎక్కువైన నీటిని వదిలేస్తుంది. నగరం మొత్తం కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చకుండా తోటలు, వనాలు, చెరువుల్లోకి చేరేలా చేయాలి. ఇప్పటికే ఉన్నవి అక్రమణలకు గురికాకుండా చూడాలి.

2. నగరంలో మురుగునీటి కాలువల్లోనే వరద నీరు కలుస్తుంటుంది. ప్రధాన మార్గాల్లో తప్ప వరదకాలువలు ప్రత్యేకంగా లేవు. ఈ రెండు వేర్వేరుగా ఉండేలా చూడకపోతే డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ కారణంగానే మన డ్రైన్లు వానాకాలంలో పొంగి రోడ్లపై ప్రవాహిస్తుంటాయి. రహదారులను దెబ్బతిస్తుంటాయి. వరద కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా నిర్వహణ ఉండాలి.

3. అధిక వర్షాలతో చెరువులు నిండి కిందికి పారుతాయి. ఒకటి నిండితే మరో చెరువులోకి వరద వెళుతుంది. ప్రవాహానికి అడ్డంకుల్లేకుండా చూడటంతోపాటూ నీరు నిల్వ ఉండే ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయాలి. విదేశాల్లో వీటినే వరద మైదానాలంటారు.

4. నగరంలో భవనాల పైకప్పులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. కురిసిన ప్రతిచుక్క రహదారిపై వచ్చి వరదతో కలుస్తోంది. ప్రాంగణంలోనే భూమిలోకి ఇంకే ఏర్పాట్లతో పాటు రూఫ్‌ గార్డెన్లతో ఉపయోగం ఉంటుంది. వర్షపు నీటిని ఎక్కువగా పీల్చుకునేందుకు ఉపయోగపడుతుంది. కూరగాయలు, ఆకుకూరలను పండించుకోవడంతోపాటు ఎండల నుంచి ఉపశమనం పొందొచ్ఛు ఆమ్లవర్షాల ప్రభావాన్ని తటస్థం చేస్తుంది.

5. పాదబాటల్లో వచ్చిన నీరు కొంతైనా భూమిలోకి ఇంకితే వరద తీవ్రత తగ్గుతుంది. అందుకు నగరాల్లో అవకాశం తక్కువ కాబట్టి పాదబాటలను రీడిజైన్‌ చేసుకోవచ్ఛు పూర్తిగా కాంక్రీట్‌, టైల్స్‌తో కప్పేయకుండా మధ్యమధ్యలో ఖాళీలు వదలడం లేదంటే నీటిని పీల్చుకునే టైల్స్‌ వేయాలి. పచ్చదనానికి పెద్దపీట వేయాలి.


ఇంకించడమే పరిష్కారం

- కల్పనా రమేశ్‌, వాననీటి సంరక్షకురాలు

వరదను తట్టుకోవాలంటే ఇల్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఇలా ప్రతి భవనంపై పడే వాన నీటిని నిల్వ చేసుకోవడంతోపాటు, భూగర్భంలోకి ఇంకేలా చేయాలి. కాలనీల్లో నీరు ఇంకేందుకు ఇంజన్షన్‌ వెల్స్‌ తవ్వాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని