నిధి రాక.. విధి లేక
eenadu telugu news
Published : 29/07/2021 02:16 IST

నిధి రాక.. విధి లేక

బల్దియా బకాయి ఇవ్వలేదని పనులు ఆపిన గుత్తేదారులు

తవ్వి వదిలిన రోడ్లపై నగరవాసుల నరకయాతన

ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ రవీంద్రనగర్‌లో నిలిచిన రోడ్డు పనులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో రోడ్ల నిర్మాణ పనులను గుత్తేదారులు ఎక్కడికక్కడే నిలిపేశారు. ఆరు నెలలుగా గుత్తేదారులకు రూ.600 కోట్ల బిల్లులను జీహెచ్‌ఎంసీ బకాయిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం బకాయిలను విడుదల చేస్తేనేగానీ తాము పనులు చేపట్టలేమని గుత్తేదారులు కరాఖండిగా చెబుతున్నారు. దీంతో తవ్వి రోడ్లపై ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతం బల్దియా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.

జీతాలకే లేక..

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో ఏటా రూ.1500 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణంతోపాటు వివిధ రకాల పనులు జరుగుతుంటాయి. వీటికి ప్రతి ఏడాది రూ.1000 కోట్లు విడుదల చేస్తుంటారు. కొన్ని బకాయిలు ఉన్నా కూడా గుత్తేదారులు పనులు కొనసాగిస్తుంటారు. గతేడాది నుంచి బల్దియా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయిదు నెలల కిందటి వరకు గ్రాంటు కింద నెలకు సర్కార్‌ రూ.70 కోట్లను విడుదల చేసేది. ఇప్పుడు ఈ నిధులు కూడా రాకపోవడంతో ఏదోలా సర్దుబాటు చేసి వేతనాలు మాత్రం చెల్లించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పనులకు నిధులను బల్దియా విడుదల చేయడం లేదు. ఆర్నెల్లుగా కొంతమంది గుత్తేదారులకు ఒక్కపైసా కూడా బకాయిలు చెల్లించలేదు. దీంతో బల్దియాలోని చిన్నా పెద్దా 250 మంది గుత్తేదారులు పదిహేను రోజులుగా పనులను నిలిపివేశారు. దీంతో పలు కాలనీల్లో అసంపూర్తి రోడ్లే కనిపిస్తున్నాయి.

బకాయిలు విడుదల చేస్తేనే పనులు చేపట్టేది

- దామోదరరెడ్డి, జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు

కొన్ని నెలలుగా జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.600 కోట్ల బకాయిలను విడుదల చేయకుండా నిలిపివేశారు. అందుకే నగరంలో అన్ని చోట్ల పనులను ఆపేశాం. ఏడెనిమిది నెలలుగా బిల్లులు విడుదల చేయకపోయినా మధ్యలో ఆపడం మంచింది కాదన్న ఉద్దేశంతో మా సభ్యులు రూ.కోట్లను అప్పులు తెచ్చి పనులను పూర్తి చేశారు. మానవతా దృక్పథంతో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు లేకుండా వివిధ పనులు చేపడుతున్నాం.

చర్యలు తీసుకుంటాం!

నిధుల విడుదలలో ఆలస్యం అవడంతో కొన్ని చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేసిన విషయం వాస్తవమేనని బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. చాలా చోట్ల పనులు జరుగుతున్నాయని ఆగిపోలేదన్నారు. నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని చోట్ల పనులను సకాలంలో పూర్తి చేయిస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని