ఈ ఏడాదీ సాగర్‌కే..
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

ఈ ఏడాదీ సాగర్‌కే..

సుప్రీంకోర్టు అనుమతితో గందరగోళానికి తెర

ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన కోలాహలం

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాలతో అటు జీహెచ్‌ఎంసీ ఇటు పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది. ఈ ఏడాదికి హుస్సేన్‌సాగర్‌లో గణనాథుల నిమజ్జనానికి అనుమతివ్వడంతో వారంరోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఆదివారం జరగనున్న నిమజ్జనోత్సవానికి అధికారులు ముస్తాబుచేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదికే సాగర్‌లో నిమజ్జనానికి అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. మునుపటి కార్యాచరణకు సవరణలు చేశారు. నగరంతోపాటు చుట్టుపక్కల నిమజ్జనం కోసం పోలీసులు 27,955 మంది సిబ్బందిని నియమించారు. జీహెచ్‌ఎంసీ నుంచే 8వేలకుపైగా అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. దాదాపు 33 ప్రాంతాల్లో 300 క్రేన్లు, వంద మంది గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. పడవలు, నిమజ్జన కేంద్రాల వద్ద విద్యుద్దీపాలు, ఇతర ఏర్పాట్లకు అధికారులు గురువారం తుదిఆమోదం తెలిపారు.

19న శోభాయాత్ర

ఈసారి 303.3 కి.మీ. పొడవున శోభాయాత్ర జరగనుందని అంచనా. ఆయా మార్గాల్లో జీహెచ్‌ఎంసీ గణేష్‌ యాక్షన్‌ టీం(జీఏటీ)లు పనిచేస్తాయి. జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగం ఆధ్వర్యంలో 33 ప్రాంతాల్లోని నిమజ్జన కేంద్రాల వద్ద 172 క్రేన్లు ఏర్పాటు చేయనుంది. చుట్టుపక్కల ఉన్న 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల వద్ద మరో 123 క్రేన్లు ఏర్పాటు చేశారు. రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రెండుపొరల ఇనుప జాలీ 12 కి.మీ పొడవునా ఏర్పాటు చేయనున్నారు. జలమండలి ఆధ్వర్యంలో 101 ప్రాంతాల్లో తాగునీటి ప్యాకెట్ల వితరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆదివారం జరిగే నిమజ్జనోత్సవాన్ని భక్తిభావంతో చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. సాగర్‌ చుట్టూ 24 అత్యాధునిక క్రేన్లను పెట్టాం. భక్తులకు తాగునీటితోపాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని