కోటి దాటింది..!
eenadu telugu news
Published : 21/09/2021 02:13 IST

కోటి దాటింది..!

3 జిల్లాల పరిధిలో ముమ్మరంగా టీకా కార్యక్రమం
నిత్యం 70-80 వేల మందికి డోసులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో కొవిడ్‌ టీకా కార్యక్రమం టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. వివిధ కారణాలతో ఆగస్టులో టీకా పంపిణీ మందకొడిగా సాగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వైద్యఆరోగ్యశాఖ వ్యూహం మార్చింది. కొన్ని రోజులుగా కార్యక్రమంలో వేగం పెంచింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో నిత్యం 70-80 వేల డోసుల టీకాలు పంపిణీ చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి 758 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 1.05 కోట్ల మంది టీకా తీసుకోవడం విశేషం. ఇతర జిల్లాలతో పోల్చితే గ్రేటర్‌ హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది. ఇందులో 59 లక్షల మంది వరకు తొలి డోసు తీసుకున్నారు. మరో 31 లక్షల మంది రెండో డోసు పూర్తి చేశారు. మొదట్లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం స్పుత్నిక్‌ కూడా వీటికి జతకలవడంతో టీకా కార్యక్రమంలో వేగం పెరిగింది. 18-44 వయస్సులోపు ఎక్కువ శాతం మంది టీకా తీసుకున్నారు. చాలామంది రెండో డోసు విషయంలో జాప్యం చేస్తున్నారని,  రెండు డోసులు తీసుకున్న తర్వాతే శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు.  18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహం లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బీపీ, మధుమేహం, క్యాన్సర్లు ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు.. అవయవ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు టీకా తీసుకోవడం వల్ల కరోనా నుంచి  రక్షణ పొందవచ్చునని పేర్కొంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని