నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం..
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

అంతిమయాత్రలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, తదితరులు

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మిరుదొడ్డికి చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు సాన నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు భరోసా ఇచ్చారు. శనివారం తొగుట మండలంలోని గుడికందుల శివారులో సాన నాగరాజు ద్విచక్ర వాహనాన్ని మల్లన్నసాగర్‌ నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న రవాణా వాహనం ఢీకొన్న ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. నాగరాజు మృతికి కారణమైన రవాణా వాహనం డ్రైవరు మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్‌పై కేసు నమోదు చేసినట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం సంబంధిత గుత్తేదారు పరిహారం కింద రూ.10 లక్షలతో పాటు రవాణా వాహన బీమా పరిహారం మొత్తం ఇచ్చేందుకు అంగీకరించిన తర్వాత నాగరాజు భార్య రజిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేయించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. నాగరాజు మృతి విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మిరుదొడ్డికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. చిన్నారుల భవితకు తన వంతు ఆర్థికసాయం ఇస్తానని చెప్పారు. నాగరాజు కుమార్తె సమీక్ష తండ్రికి అంత్యక్రియలు నిర్వహించగా చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని కడసారి చూసేందుకు దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని