‘సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే’
eenadu telugu news
Published : 27/09/2021 03:37 IST

‘సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే’


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న నారాయణ. చిత్రంలో పశ్యపద్మ, శోభ, పల్లా వెంకట్‌రెడ్డి,
నర్సింహారెడ్డి, సత్యనారాయణ, సారంపల్లి మల్లారెడ్డి, అజీజ్‌పాషా

మియాపూర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పేద కార్మిక, కర్షక కళాకారులు ఏకమై నిర్వహించిన మహత్తర పోరాటం చరిత్రలోనే మరువలేని ఘట్టమని సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్‌.సుగుణమ్మ తన స్వీయ అనుభవాలతో రూపొందించిన ‘పోరాటాల బాటలో అరుణ కిరణాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. తెలంగాణలో భూస్వాములు, దొరల కబ్జాలోని వేల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. అయితే ఇటీవల కొందరు తాము పోరాట యోధులమంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ముఖ్యంగా భాజపా ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని కేవలం హిందూ, ముస్లింల గొడవగా చిత్రీకరించే యత్నం చేయడం తగదని పేర్కొన్నారు. నిజాం ఆగడాలను ఎదుర్కొని పోరాటం నిర్వహించిన ఎస్వీకే ప్రసాద్‌, కోదండరామిరెడ్డి వీరత్వం మరువలేనిదని కార్యక్రమానికి హాజరైన తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటూ పేదలపై ధరల భారం మోపుతూ పాలన సాగిస్తున్నారన్నారు. మాజీ వీసీ ఆవుల మంజులత, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహరావు, రఘుపాల్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, చెన్నకేశవరావు, డాక్టర్‌ శాఖమూరి శోభ, తాండ్రకుమార్‌, పరుచూరి జమున ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని