వరదలకు ఏడాదిఅయినా పరిహారమేదీ?
eenadu telugu news
Published : 17/10/2021 04:14 IST

వరదలకు ఏడాదిఅయినా పరిహారమేదీ?

మృతుల కుటుంబాల్లో కొన్నింటికి ఇంకా అందని వైనం
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితులు
ఈనాడు, హైదరాబాద్‌

ప్పటివరకు హాయిగా.. ఆనందంగా సాగిపోతున్న జీవితాలు వారివి. ఒక్క ఉపద్రవం కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఆ ఒక్క రాత్రిలోనే జీవితాలు తెల్లారిపోయాయి. వారిని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబసభ్యులు రోడ్డున పడ్డారు. పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని వేయికళ్లతో ఎదురుచూసినా.. ప్రభుత్వం నుంచి చేయూత కొరవడింది.. ప్రస్తుతం ఆ కుటుంబాలు కూలీనాలీ చేసుకుని బతుకుతున్నాయి. ఏడాదిగా సర్కారు నుంచి రావాల్సిన సాయం అందక ఆర్థికంగా సతమతవుతున్నారు. గతేడాది అక్టోబరు 13, 14 తేదీల్లో వచ్చిన వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడిచినా పరిహారం అందలేదు. కుటుంబానికి ఆసరాగా నిలిచే వ్యక్తులు కోల్పోయి.. ఆర్థిక భరోసా కొరవడి నానా ఇబ్బందులు పడుతున్నారు. నాటి వరదలలో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 24 మంది చనిపోయారు. కొందరికి పరిహారం అందించగా.. మరికొందరికి అందలేదు.


కుటుంబ పెద్దను కోల్పోయి..

కందుకూరు మండలం బేగంపేటకు చెందిన మాదారం వెంకటేశ్‌గౌడ్‌ గతేడాది అక్టోబరు 13న రాత్రి నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టుకు వెళుతూ వరదల్లో చిక్కుకుని అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలం లష్కర్‌గూడ వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. వెంకటేశ్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసేవారు. అతనికి భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వెంకటేశ్‌ సంపాదనపైనే కుటుంబం ఆధారపడి ఉండేది. కుటుంబ పెద్ద మరణించడంతో భార్య, పిల్లలు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. అనిత కూలీ పనులు చేసుకుని జీవిస్తోంది. ప్రస్తుతం ఆమె సంపాదనే కుటుంబానికి జీవనాధారంగా మారింది. పిల్లల చదువులకు ఇబ్బందికరంగా మారిందని ఆమె కన్నీటిపర్యంతమవుతున్నారు. గతేడాది ఘటన జరిగిన తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులు కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించి వెళ్లారు. అవి రాకపోగా ఓ బ్యాంకులో కట్టిన రూ.12 యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ సైతం రాలేదన్నారు. ‘‘ఆ రోజు రాత్రి అన్న ఫోన్‌ చేసి భయపడిన సందర్భం తలచుకుంటే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. వరదలో కొట్టుకుపోతూ చెట్టును పట్టుకుని నాకు ఫోన్‌ చేశాడు. చెట్టు కొమ్మ సరిగా లేదని వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చెట్టు కొమ్మ విరిగిపోతోందని ఫోన్‌లో చెబుతూనే కొట్టుకుపోయాడు. ఆ మాటలు నా మనసులో ఇంకా వినపడుతూనే ఉన్నాయని వెంకటేశంగౌడ్‌ తమ్ముడు రమేశ్‌ వివరించారు.


పెద్ద కొడుకును పోగొట్టుకుని..

కుటుంబ పోషణ భారమై..

కందుకూరు మండలం బాచుపల్లికి చెందిన రాఘవేందర్‌ వెంకటేశ్‌తో కలిసి చెర్వుగట్టుకు వెళుతూ వరదలో కొట్టుకుపోయాడు. గ్యాస్‌ కంపెనీలో పనిచేసి నెలకు రూ.13 వేల వరకు సంపాదిస్తూ తండ్రి అంజయ్యకి చేదోడువాదోడుగా ఉండేవాడు. తమ్ముడ్ని చదివించాడు. తర్వాత మల్టీమీడియా కోర్సు చేసేందుకు నగరానికి వచ్చి నెలకే చనిపోయాడు. ప్రస్తుతం రాఘవేందర్‌ తండ్రి కూలీ పనులు చేసుకుని జీవితం గడుపుతున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం కోసం ఏడెనిమిదిసార్లు కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులను కలిశాం. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని అంజయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని