కార్పొరేట్లివి
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

కార్పొరేట్లివి

ప్రతి పనికీ వసూళ్లు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, న్యూస్‌టుడే-జూబ్లీహిల్స్‌

* శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ కార్పొరేటర్‌ తన పరిధిలో నిర్మించే భవనాల యజమానులను ఇంటికే పిలిపించి.. ప్రతి దానికి ఇంతని రేటు చెబుతున్నారు. అప్పు తెచ్చి కట్టుకుంటున్నానని వేడుకున్నా ఆయన మనసు కరగదు. అంత స్తోమత లేకపోతే నిర్మాణాన్ని ఆపేయమని హెచ్చరిస్తున్నారు.

* కొంతమంది కార్పొరేటర్లు వ్యాపార సంస్థలపై జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా తమ వారందరితో ఓ హోటల్‌కు వెళ్లిన ఓ కార్పొరేటర్‌.. తిన్న తరువాత బిల్లు చెల్లించే సమయంలో నేనెవరో తెలుసా..అంటూ ప్రశ్నించారు. సదరు నిర్వాహకుడు ఎవరైనా బిల్లు చెల్లించాలి కదా.. అంటూ తేల్చిచెప్పడంతో కోపగించుకున్న ఆయన.. ఏఎంవోహెచ్‌కు ఫిర్యాదు చేసి వారంపాటు హోటల్‌ను బంద్‌ చేయించారు. దిగివచ్చిన హోటల్‌ యజమాని.. రూ.లక్ష ఇవ్వడమే కాకుండా రోజుకు వేయి రూపాయల వంతున చెల్లించడంతోపాటు మనిషిని పంపితే కావాల్సింది ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

మహానగరం పురోభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన పలువురు కార్పొరేటర్లు అక్రమమార్గంలో ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తమ డివిజన్‌ పరిధిలో నిబంధనలకు లోబడి చిన్న ఇల్లు కట్టుకున్నా కార్పొరేటర్‌ అడిగింది ఇవ్వకపోతే సంబంధిత నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోతుంది. కొంతమంది తమ పరిధిలో తోపుడుబండ్ల వ్యాపారుల నుంచీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కార్పొరేటర్ల అక్రమార్జన, దందాపై ప్రభుత్వానికి అనేకమంది ఫిర్యాదు చేస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో జరిగిన బల్దియా ఎన్నికల్లో అధికార తెరాస 56 డివిజన్లను, భాజపా 47, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ పార్టీ 3 డివిజన్లు గెల్చుకున్నాయి. ఈ కార్పొరేటర్లంతా బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే అక్రమాలకు తెరతీశారు. ఇందులో అన్ని పార్టీల వారు ఉన్నారు. రోజూవారీ సంపాదన మీదే దృష్టి సారించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమాలు జరిగే తీరిది

కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణం ఇతరత్రా పనులను గుర్తించేందుకు కొంతమంది వ్యక్తులకు నెలవారీ జీతం ఇచ్చి నియమించుకున్నారు. వీరిపని రోజూ బైక్‌పై తిరిగి కొత్త నిర్మాణాలు ఎక్కడ మొదలయ్యాయి, ఇతరత్రా వివరాలన్నీ కార్పొరేటర్‌కు చేరవేయాలి. అన్ని అనుమతులు చూపించినా అడిగినంత ఇవ్వపోతే బల్దియాకు ఫిర్యాదు చేసి పనులను ఆపిస్తామని కార్పొరేటర్లు బెదిరిస్తున్నారు. నిర్మాణాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు భూవివాదాల్లో తలదూర్ఛి. సెటిల్‌మెంట్లు చేసి భారీగా డబ్బు గుంజుతున్నారు. సర్కారు జాగాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు.. కార్పొరేటర్లు అడిగినంత ఇస్తే దర్జాగా ‘ఆక్రమణ’ ఇంటిలోనే ఉండొచ్ఛు

ఆవిడ గారి భర్త మరీ..

పశ్చిమ మండల పరిధిలో ఉన్న ఓ కార్పొరేటర్‌ భర్త వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అది జాతీయ రహదారిపై ‘అమీరు’, గరీబులు వ్యాపారం చేసుకొనే ప్రాంతం.. ఆ రహదారిపై దాదాపు 200ల తోపుడు బండ్లు నడుపుకొనే చిరు వ్యాపారులున్నారు. అంతే ‘ఆయన’గారి కన్ను వాటి మీద పడింది. తన మనుషులను పంపాడు. రోజుకు రూ.200లు ఇవ్వాల్సిందే అంటూ బేరం పెట్టాడు. అంటే రోజుకు రూ. 40వేల వసూళ్లన్నమాట. చిరువ్యాపారులు లబోదిబోమంటూ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నేరుగా ఆయనను పిలిచి చివాట్లు పెట్టి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గుత్తేదారులూ కమీషన్‌ ఇవ్వాల్సిందే!

బల్దియా ఆధ్వర్యంలో ఏటా రూ.3 వేల కోట్ల విలువైన వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఆయా పనులను దక్కించుకున్న గుత్తేదారు స్థానిక కార్పొరేటర్‌కు పర్సంటేజీ ఇస్తేనే పనులు సజావుగా సాగుతాయి. నిరాకరిస్తే ఆటంకాలు సృష్టిస్తారని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కమీషన్ల బాధ భరించలేక కొన్ని డివిజన్లలో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని