55 శాతానికి కోలుకున్న పర్యాటక రంగం
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

55 శాతానికి కోలుకున్న పర్యాటక రంగం


మాట్లాడుతున్న సంతోష్‌ ఖన్నా

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌కు ముందున్న డిమాండ్‌లో 55 శాతానికి పర్యాటక రంగం కోలుకుందని థామస్‌ కుక్‌ ఇండియా లీజర్‌ ట్రావెల్‌ ఉపాధ్యక్షుడు సంతోష్‌ ఖన్నా వెల్లడించారు. దేశీయంగా ప్రయాణాలపై ఆంక్షలు తొలగించడం, అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతిస్తుండటంతో రెండు, మూడు నెలల్లో పర్యాటకం మరింత కోలుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా నెలవారీ వృద్ధి 65 శాతంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌తో ఆంక్షలు విధించిన 18 నెలల తర్వాత అంతర్జాతీయ సరిహద్దులు తిరిగి తెరవడం, టీకాల కార్యక్రమం చురుగ్గా సాగడం వంటి సానుకూలతల నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు యాత్రలవైపు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. విహారాలతో పాటూ పెళ్లిళ్లు, హానిమూన్‌ విభాగంలో ప్రయాణాలు పెరిగినట్లు చెప్పారు. ఎక్కువగా దుబాయ్‌, అబుదాబి, మాల్దీవులు, థాయిలాండ్‌ వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. యూరోప్‌ రెండో ప్రాధాన్య అంతర్జాతీయ గమ్యస్థానంగా ఉందన్నారు. స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రియాతో పాటూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాకూ ఎక్కువగా వెళ్తున్నారని చెప్పారు. దేశీయంగా కశ్మీర్‌, లద్దాఖ్‌, అండమాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటూ గోవాకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ముంబయి, గోవా, కొచ్చి, లక్షద్వీప్‌ కేంద్రంగా క్రూయిజ్‌ పర్యాటకం పెరుగుతోందన్నారు. సమావేశంలో థామస్‌ కుక్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ మేనేజర్‌ అబ్దుల్‌ సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని