ఈ సారి డిపాజిట్ దక్కేది ఎవరికో ?
eenadu telugu news
Updated : 20/10/2021 06:40 IST

ఈ సారి డిపాజిట్ దక్కేది ఎవరికో ?

 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలకే అవకాశం

 బద్వేలు త్రిముఖ పోరులో ఓటర్ల నాడిపై సర్వత్రా ఆసక్తి

 చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం నామమాత్రమేనా?

బద్వేలు పట్టణం

ఈనాడు డిజిటల్‌, కడప : బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు ప్రతిసారి రెండు ప్రధాన పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపారు. మిగిలిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొన్నిసార్లు, భాజపా పోటీ చేసిన ప్రతిసారి ఇలాంటి పరాభవాలు ఎదుర్కొన్నాయి. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉండడంతో ఓటరు నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలను వైకాపా, భాజపా, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్ల ఆధిక్యం కంటే ఎక్కువగా సాధించడానికి అధికార వైకాపా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించడానికి కాంగ్రెస్‌, భాజపా కృషి చేస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థన...

బద్వేలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతిచెందడంతో జరుగుతున్న ఉపఎన్నికలో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ముగ్గురు మాత్రమే బరిలో ఉన్నారు. మిగిలిన వాటిలో 7 చిన్న పార్టీలు, అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఇద్దరిని వైకాపా నాయకులే ఎన్నికల అనుమతులకు పోటీలో ఉంచినట్లు సమాచారం. చిన్నపార్టీల, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నా ఇంటింటి ప్రచారంపై పెద్దగా దృష్టిసారించలేదు. తమ సన్నిహితులు, తెలిసినవారి ఓట్లను దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఉపఎన్నికలో వీరి ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాళ్లకు 2 శాతం కంటే తక్కువ ఓట్లు...

పార్లమెంటు, శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం డిపాజిట్‌ విధానం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్కో అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్‌ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేస్తుంటే రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల ఫలితాల్లో చెల్లుబాటైన మొత్తం ఓట్లలో కనీసం ఆరో వంతు అంటే 16.7 శాతం సాధించిన అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్‌ మొత్తాన్ని కేంద్రం ఎన్నికల సంఘం వెనక్కి ఇస్తుంది. గత రెండు దశాబ్దాలుగా బద్వేలులో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కేవలం రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి దక్కించుకుంటున్నాయి. వైకాపా ఏర్పాటుకు ముందు తెదేపా, కాంగ్రెస్‌.. ఏర్పడిన తర్వాత వైకాపా, తెదేపా మాత్రమే 16.7 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించాయి. మిగిలిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నా ఎప్పుడూ 2 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన దాఖలాల్లేవు. అయితే 2009 ఎన్నికలను మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్ఛు ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సింగమల వెంకటేశ్వర్లు 9,574 ఓట్లు (7.08 శాతం) పొందగా, ఆయన కూడా డిపాజిట్‌ కోల్పోక తప్పలేదు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో ఆయన నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని