Updated : 21/04/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైద్య సేవల్లో పోటాపోటీ

‘కాయకల్ప’కు నామినేషన్‌..

‘ఎన్‌క్యాష్‌’ రేసులో పరుగులు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

లక్ష్మీపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు పోటీల్లో జిల్లాలోని పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పోటీ పడుతున్నాయి. గతేడాది ‘కాయకల్ప’ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన రాఘవపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అత్యుత్తమ ఆరోగ్య కేంద్రాలుగా గుర్తించిన జిల్లా స్థాయి కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే రాష్ట్రస్థాయి కమిటీ నుంచి ఆయా ఆరోగ్య కేంద్రాలను అత్యుత్తమంగా ప్రకటిస్తూ ఆదేశాలు రానున్నాయి. జనగామ పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు రాగినేడు, ఎలిగేడు, పుట్నూరు, మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రోత్సాహకంగా ఒక్కో దానికి రూ.50 వేల చొప్పున నగదు బహుమతులను, ప్రథమ స్థానంలో ఎంపికైన లక్ష్మీపురం, రాఘవపూర్‌ ఆరోగ్య కేంద్రాలకు రూ.2 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.

నాణ్యతా ప్రమాణాలకు ‘ఎన్‌క్యాష్‌’

జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటించే సంస్థలకు నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్సు స్టాండర్డ్స్‌’ సంస్థ ‘ఎన్‌క్యాష్‌’ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తుంది. ఈ ధ్రువీకరణ పొందిన పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున వరుసగా మూడేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుంటారు. గతేడాది కాయకల్పకు ఎంపికైన లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఈసారి కాయకల్పకు ఎంపికైన రాఘవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ‘ఎన్‌క్యాష్‌’ పరిశీలనకు దస్త్రాలను పంపించారు. ఈమేరకు ఇటీవల జాతీయ స్థాయిలో ఎన్‌క్యాష్‌ పరిశీలన బృందం వర్చ్యువల్‌ విధానంలో జూమ్‌ యాప్‌ ద్వారా సుమారు ఆరు గంటల పాటు రాఘవపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. దాదాపు పరిశీలన బృందం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. త్వరలోనే లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం ‘ఎన్‌క్యాష్‌’ ప్రతినిధి బృందం వర్చ్యువల్‌ విధానంలో పరిశీలించనున్నారు. ఇది పూర్తికాగానే లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాఘవపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫలితాలను విడుదల చేయనుంది.

విభాగాలు 12... ఉప విభాగాలు 74

పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని 12 విభాగాల్లోని 74 ఉప విభాగాల్లో వైద్య సేవలు, నిర్వహణ తీరుపై ‘ఎన్‌క్యాష్‌’ బృందం పరిశీలిస్తుంది. 74 ఉప విభాగాల్లో మళ్లీ ఒక్కో ఉప విభాగంలో శాఖలు ఉంటాయి. ఒక్కో అంశానికి 2 మార్కులు కేటాయిస్తారు. మొత్తం మీద 70 శాతానికి మించి మార్కులు సాధించిన పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘ఎన్‌క్యాష్‌’ ప్రోత్సాహకాలకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే రాఘవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయా నిబంధనల ప్రకారంగా ఎన్‌క్యాష్‌ బృందం ఆన్‌లైన్‌లో పరిశీలించగా, లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే కాయకల్పలో జిల్లాలో అత్యుత్తమ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపికై రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకం అందుకున్న లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ‘ఎన్‌క్యాష్‌’కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కాయకల్ప, ఎన్‌క్యాష్‌’ తదితర పోటీల్లో సాధించిన నగదును 75 శాతం ఆయా ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను పెంపొందించేందుకు ఉపయోగించాల్సి ఉండగా, మిగతా 25 శాతం సిబ్బందికి ఇన్సెంటివ్‌గా చెల్లించనున్నారు. ఈసారి కాయకల్పతో పాటు ఎన్‌క్యాష్‌లో లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాఘవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బహుమతులు కైవసం చేసుకుంటాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని