అయితే వరి.. లేదంటే పత్తి
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

అయితే వరి.. లేదంటే పత్తి

ప్రత్యామ్నాయ పంటల సాగు ఊసేదీ!

విక్రయ వసతులు లేక ఆరుతడిపై అనాసక్తి


కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం(పాతచిత్రం)

న్యూస్‌టుడే, పెద్దపల్లి: వరి.. పత్తి.. రైతులు ఈ పంటల చుట్టే పరుగు పెడుతున్నారు. అధికారులు సైతం సన్న వడ్లు, దొడ్డు వడ్ల పాటే పాడుతుండటంతో వరి సాగు సంప్రదాయంగా మారింది. ఇక పత్తి సైతం ఇదే తరహాలో సాగు చేస్తుండటంతో మూడో పంటకు అవకాశమే లేకుండా పోతోంది.

ఒక ఏడాదిలో పత్తి ధర తగ్గితే మరుసటి సంవత్సరం వరి సాగు వైపు మొగ్గు చూపే రైతులు నీటి ఎద్దడి ఏర్పడితే పత్తి తప్ప మరో ఆరుతడి పంటపై ఆలోచనే చేయడం లేదు. ఒకప్పుడు మొక్కజొన్న పంటకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఎస్సారెస్పీ నీరు అందుబాటులోకి వచ్చిన తరువాత సాగు స్వరూపమే మారిపోయింది. వరితో పాటు పత్తి, మిర్చిలాంటి వాణిజ్య పంటల వైపు అడుగులు వేసిన రైతులు.. తాజాగా మారిన ప్రభుత్వ వైఖరి, మార్కెట్‌లో గిట్టుబాటు ధరల నేపథ్యంలో మరో పంటవైపు అడుగులేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

శీతల గిడ్డంగుల నిర్మాణమేదీ

నిల్వ వరి తర్వాత ముఖ్యమైన ఆహార పంటలైన కూరగాయలకు డిమాండ్‌ అధికం. అయితే జిల్లాలో శీతలగిడ్డంగులు అందుబాటులో లేవు. పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్‌లలోని మార్కెట్లతో పాటు పెద్ద రైతులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లిన రోజు ధర పడిపోతే రవాణా ఖర్చులు కూడా సరిపోని పరిస్థితి. అవసరాలకు అనుగుణంగా శీతలగిడ్డంగుల నిర్మాణానికి ప్రయత్నాలు జరగడం లేదు. ఇతర పంటలు సాగు చేసిన రైతులకు వాటిని అమ్ముకునేందుకు ఊళ్లు పట్టుకు తిరగాల్సిన పరిస్థితులున్నాయి. రైతులు పండించిన ఇతర పంటలను విక్రయించే వ్యవస్థలు, కొనుగోలుదారులు లేకపోవడం కూడా వరి సాగువైపు మళ్లేలా చేస్తున్నాయి.


ఏటికేడు పెరుగుతున్న సాగు విస్తీర్ణం

* నీటి వసతి ఉంటే వరి సాగే సులువని రైతులు భావిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరి తప్ప మరో పంట విత్తుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదు. ఆయా గ్రామాల్లోని నేలల స్వభావం కూడా వరి సాగుకు అనుకూలంగా ఉంది.

* పెద్దపల్లి మండలం కాసులపల్లి, బొంపల్లి, కనగర్తి తదితర గ్రామాల్లో 95 శాతం విస్తీర్ణంలో వరినే సాగు చేస్తున్నారు. అధిక తేమను తట్టుకోవడంలో వరికి మించిన పంట లేదు.

* నీటి లభ్యత ఎక్కువగా ఉన్న చిత్తడి నేలల్లో దోమపోటు లాంటి చీడపీడల సమస్య అధికంగా ఉంటున్నా వరి పంటనే ప్రత్యామ్నాయంగా మారింది.

* సన్న రకం.. లేదంటే దొడ్డు రకం.. ఏదో ఒకటి విత్తుకోవాల్సిందే అనే పరిస్థితులు గ్రామాల్లో నెలకొనడం, సాగునీటి వనరులు అభివృద్ధి చెందడంతో సాగు విస్తీర్ణం యేటికేడు పెరుగుతోంది.

* ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో అమ్ముకోవడానికి సమస్య లేకుండా పోయింది. ఫలితంగా సులభ శైలి వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు ఇతర పంటల సాగును మరిచిపోయారు.

* నేటి తరానికి వరి, పత్తి తప్ప ఇతర పంటల సాగుపై అవగాహన లేకుండా పోయింది.

* రెండు, మూడేళ్ల కిందట పత్తికి బదులు కంది సాగు చేసినా రైతులకు మద్దతు ధర దక్కలేదు. దీంతో పంట కొనాలంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అమ్ముకోవడానికి ఇబ్బందులు

జూపల్లి వెంకటేశ్వర్‌రావు, రైతు, హన్మంతునిపేట

మూడేళ్లుగా కంది సాగు చేస్తున్నాను. దిగుబడులు, ధర పత్తితో సమానంగానే ఉంటుంది. పత్తితో పోలిస్తే క్రిమిసంహారక మందుల వినియోగం చాలా తక్కువ. కూలీల ఖర్చే ఉండదు. పంట కోతకు హార్వెస్టరును వినియోగిస్తున్నాం. అయితే మార్కెటింగ్‌ వసతి లేదు. గతేడాది పెద్దపల్లిలో కందులు కొనుగోలు చేయకపోవడంతో ధర్మారంలో విక్రయించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని