ఇంతకీ ఓటు ఉన్నట్టా.. లేనట్టా..!
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

ఇంతకీ ఓటు ఉన్నట్టా.. లేనట్టా..!

కొత్త ఓటరు జాబితా అందక అయోమయం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ హుజూరాబాద్‌లో ఓటు పరిశీలన విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంటోంది. ఓటింగ్‌ సజావుగా జరిపించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నామని యంత్రాంగం చెబుతున్నా.. కీలకమైన కొత్త ఓటరు జాబితాను ఊరూర ప్రదర్శించే విషయంలో నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. పెరిగిన ఓట్ల తీరుని బట్టి ఇక్కడి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య కూడా మారింది. గత ఎన్నికల్లో ఉన్నవాటికన్నా అదనంగా ఇక్కడ కొత్త కేంద్రాలు పుట్టుకొచ్చాయి. దీంతో సదరు ఓటరుకు తమ ఓటు జాబితాలో ఉందో లేదోననే సందేహం తలెత్తుతోంది. పైగా ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల సంఖ్య విషయంలోనూ గణనీయమైన మార్పులు చోటు చేసకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో  మాత్రం ఊరికి ఒకటి రెండు పోలింగ్‌ బూత్‌లు ఆయా పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తుండటంతో ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగడం లేదు. ఉన్న సమస్యల్లా పట్టణ కేంద్రాల్లోని ఓటర్లు ఎదుర్కొంటున్నారు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు పురపాలిక ఎన్నికల్లో ఓట్లేసే సందర్భంలో ఓట్లు తారుమారయ్యాయి. ఒక కేంద్రంలో ఓటేసిన వ్యక్తికి మరోచోట ఓటు ఉన్నట్లు గందరగోళమనే పరిస్థితిని పలువురు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఇక్కడి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు విషయంలో తిరకాసు  తప్పేట్టు లేదు.

ప్రదర్శనల ఊసే లేదు..!

వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమై.. నామినేషన్ల ఘట్టం సమయంలోనే ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు.? వారి జాబితా వివరాల్ని అన్ని గ్రామపంచాయతీలు సహా పురపాలికల్లోని వార్డుల్లో ప్రజలకు సులవుగా పరిశీలించుకునే వెసులుబాటును ఎన్నికల అధికారులు కల్పించాలి. ఇందుకోసం ఆయా పీబీఎల్వో( పోలింగ్‌బూత్‌ లెవల్‌ అధికారి), అంగన్‌వాడీ కార్యకర్తలను అందుబాటులో ఉంచి ఓటు ఉన్నదా..? ఉంటే ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందనే సంఖ్య, ఇతర వివరాల్ని తీసుకోవచ్చు. కానీ ఇలాంటి ప్రక్రియని ఇక్కడి అధికారులు నిర్వహించలేదు. పలుమార్లు ఆయా గ్రామాల్లో యువత సహా కొత్త ఓటు వచ్చిన వారు జాబితా గురించి అడిగినా తమకు తెలియదనే సమాధానాల్ని కిందిస్థాయి సిబ్బంది చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఈ నియోజకవర్గంలో మొత్తంగా ఇంతమంది ఓటర్లు అర్హులని ప్రకటించిన అధికారులు తదనంతరం కూడా వాటి తుది ముసాయిదాను ఏ ఒక్కచోట అతికించలేదు. కాగా ఓటర్ల జాబితాలో చాలా వరకు చనిపోయిన వారి వివరాలు అలాగేఉండటం సహా పేర్లు, ఫొటోల పరంగా తప్పుడు వివరాలున్నాయనే ఉద్దేశంతోనే ఇలా జాబితాను బహిర్గతం చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. పైగా ఓటర్లు జాబితాలను అంతర్జాలంలో చూసుకోవాలనేలా ఉచిత సలహాల్ని అధికారులిస్తున్నారు.  ఆయా రాజకీయ పార్టీలకు మాత్రం జాబితాను అందించామని.. ఎవరైనా అవసరమైతే అక్కడికి వెళ్లి మీ ఓటు గురించి ఆరా తీసుకోండనేలా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానిస్తుండటం కొసమెరుపు.  ఏది అడిగినా కోడ్‌ ఉన్నందున తామెమి మాట్లాడలేమని తెలివిగా సమాధానమిస్తున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు.

పోల్‌చీటీలు నామమాత్రంగానే..!

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లందరికీ పోలింగ్‌ చీటీలను అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది పంపిణీ చేయాలి.  ఈ వ్యవహారాన్ని ఎప్పటిలాగే మొక్కుబడిగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. నామమాత్రంగానే పంపిణీ చేసి మమ అనిపించేలా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఆరు రోజుల వ్యవధి మాత్రమే ఉండటం ఈ లోగా 305 బూత్‌లలోని 2.36లక్షల మందికి వీటిని చేరవేయడం కష్టసాధ్యమైన పనే.! కాగా ఎప్పటిలాగా బీఎల్‌వోలకు, అంగన్వాడీ కార్యకర్తలకు అందించి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. సక్రమంగా ఈ చీటీల పంపిణీ జరగకపోతే ఎన్నికల సంఘం ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఫొటో గుర్తింపుతో అందించే వీటికి ప్రాధాన్యం లేకుండా పోనుంది. ఇప్పటికే పంపిణీని ప్రారంభించామని పూర్తిస్థాయిలో ప్రతి ఓటరుకు వీటిని అందిస్తామని అధికారులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని