Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు నెత్తిన రవాణా రుసుములు

మొక్కజొన్న కొనుగోళ్లలో గుత్తేదార్ల మాయాజాలం

ట్రాక్టర్లలో గోదాములకు చేరుస్తున్న కర్షకులు

● బాడుగ, ఇతరాలతో రూ.3 వేల అదనపు భారం


మిడుతూరు రహదారిలో బారులు తీరిన వాహనాలు

ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి పంట కొనుగోలు చేసింది. కేంద్రాల నుంచి గోదాములకు సరకు చేర్చడానికి గుత్తేదారుకు జిల్లాలో బాధ్యతలిచ్చింది. రోజులు గడుస్తున్నా, గుత్తేదార్లు లారీలు ఏర్పాటు చేయకపోవడంతో ఉత్పత్తులు వర్షానికి తడుస్తాయన్న భయం రైతులో ఉంది. ఇదే అవకాశంగా...కర్షకులనే గోదాములకు తరలించుకోవాలని, ఆపై.. బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తామని చెప్పారు. ఆందోళనలో ఉన్న సాగుదారులు ఆ మాటలు నమ్మి గోదాముకు సరకు తరలించగా, రోజుల తరబడి వేచి ఉన్న బాడుగ సైతం రైతులపైనే పడుతోంది. ఇదీ మొక్కజొన్న అమ్ముకున్న రైతుల దైన్యస్థితి.

- న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌ -కర్నూలు, నందికొట్కూరు, గడివేముల

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న ఉత్పత్తులను గోదాములకు చేర్చే బాధ్యత ఓ గుత్తేదారుకు అప్పగించారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు చేతులెత్తేయడంతో, జేసీ ఆధ్వర్యంలో స్థానికంగా టెండర్లు పిలిచారు. టన్నుకు రూ.190 చొప్పున ఉత్పత్తులు గోదాముకు చేర్చడానికి జిల్లాలో ఒక గుత్తేదారు తీసుకున్నారు. ప్రధాన గుత్తేదారు స్థానికంగా కొందరు ఉప గుత్తేదార్లకు రవాణా అప్పగించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన పాత సరకు కేంద్రాల వద్ద నిలిచిపోయింది.

రైతే సొంత ఖర్చులతో...: కొనుగోలు కేంద్రాల నుంచి కర్షకులే సొంత ఖర్చులు పెట్టుకుని ట్రాక్టర్లు, లారీలతో గోదాములకు సరకు చేరుస్తున్నారు. రవాణా ఖర్చు మీ ఖాతాల్లో కలిపి వేయిస్తాం అంటూ ఉప గుత్తేదారులు ఇచ్చిన హామీతో రైతులే సొంతంగా సరకు గోదాములకు తీసుకెళుతున్నారు. గోనె సంచులు, పురికొస(దారం), హమాలీల ఖర్చు, వే-బ్రిడ్జి ఇలా మొత్తం కలిసి ఒక్కో బస్తాకు రూ.30 వరకు ఖర్చు తేలింది. తీరా గోదాం వద్దకు వెళ్లగా 2-3 రోజుల పాటు సరకు దించుకోకపోవడంతో మూడు రోజుల ట్రాక్టరు బాడుగ సైతం రైతులపైనే పడుతోంది. ఇలా ఒక్కో రైతుపై రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు భారం తప్పడం లేదు.

గోదాముల్లో ఖాళీ లేక....

జిల్లాలో ఉన్న వేర్‌హౌస్‌ గోదాములు, ప్రైవేటుకు లీజుకు తీసుకున్న గోదాములలో మొక్కజొన్న సరకు నిల్వ చేస్తున్నారు. ప్రైవేటు గోదాముల్లో ఇప్పటికే పాత నిల్వలు ఉండటంతో అవి ఖాళీ చేసి మొక్కజొన్న దిగుమతి చేసుకోవడానికి సమయం పడుతోంది. దీంతో రైతులు రోజుల తరబడి గోదాముల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. తలముడిపి గోదాం వద్ద మూడు రోజులుగా రైతులు సరకుతో బారులు తీరారు. తీరా శుక్రవారం సాయంత్రం గోదాములో ఖాళీ లేదనే సరికి దిగాలుగా వెనుదిరగాల్సి వచ్చింది.

రవాణా పేరుతో రూ.లక్షల్లో అక్రమాలు

కొనుగోలు కేంద్రం వద్ద అమ్మిన రైతుకు..రవాణా గుత్తేదారు ఏర్పాటు చేసిన లారీలకు సరకు ఎత్తేవరకు బాధ్యత. రైతులకు రవాణా ఖర్చులు ఇస్తామని చెప్పినా తరువాత ఇవ్వడం లేదు. రవాణా కాంట్రాక్టు తీసుకున్న వారికే టన్నుకు రూ.190 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. గతేడాది సైతం ఇలానే రైతులను రవాణా చేసుకోవాలని, ఉప గుత్తేదార్లు సూచించి చివరికి నగదు జమ చేయకుండా జేబులు నింపుకొన్నారు. గడివేముల మండలంలో గతేడాది రవాణా బాడుగ రూ..4 లక్షల వరకు పెండింగ్‌ ఉంది. దీనిపై మార్క్‌ఫెడ్‌ ఇన్‌ఛార్జి డీఎం సత్యన్నారాయణ చౌదరిని వివరణ కోరగా రైతు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రవాణా ఖర్చు గుత్తేదారుడికి ఇస్తామే కానీ, రైతుకు ఇవ్వమన్నారు.

అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం

- రామకృష్ణ, ముచ్చుమర్రి

అయిదు ఎకరాల్లో మొక్కజొన్న పండించాను. 130 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. పంట వచ్చి ఇరవై రోజులవుతున్నా ఎవరూ స్పందించ లేదు. వర్షాలకు తడుస్తుందేమోనని సొంత ఖర్చులు పెట్టుకుని, ట్రాక్టర్లకు బాడుగలిచ్చుకుని 3వ తేదీ రాత్రి గోదాం వద్దకు వచ్చాం. ఇంకా సరకు దించలేదు. ఎప్పుడు దిగుమతి చేస్తారో తెలియదు.

కాటా కోసం కొట్లాట..

- మిడుతూరు, పీరుసాహెబ్‌పేటలో బలగాల పహరా


కొనుగోలు కేంద్రం వద్ద పోలీస్‌ ఉన్నతాధికారులు, తహసీల్దారు

నందికొట్కూరు, మిడుతూరు, న్యూస్‌టుడే: మిడుతూరు, పీరుసాహెబ్‌పేట గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొక్కజొన్న పంట కాటా వేసే విషయమై రైతులు, కొందరు హమాలీల మధ్య తలెత్తిన వివాదం రెండు గ్రామాల మధ్య పంతాలకు దారి తీసింది. ఈ క్రమంలో మూడు రోజులుగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆగిపోయాయి. పీరుసాహెబ్‌పేటలోని కొనుగోలు కేంద్రం వద్ద మిడుతూరు గ్రామ హమాలీలు కాటాలు వేస్తుండగా వాళ్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని, తమ గ్రామానికి చెందిన హమాలీలతోనే తూకాలు జరగాలని స్థానికులు రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనకు నిరసనగా మిడుతూరులోనూ అక్కడి గ్రామస్థులు ధర్నాకు సిద్ధమయ్యారు. పీరుసాహెబ్‌పేటవాసులు మిడుతూరులో కూరగాయలు, కిరాణా, హోటళ్లకు వెళితే వెెనక్కి పంపేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం తెల్లవారుజామునే రెండు గ్రామాల్లో బలగాలను దింపారు. మిడుతూరులో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. పీరుసాహెబ్‌పేట కొనుగోలు కేంద్రం వద్ద పోలీసులు మోహరించి మార్కెట్‌ అధికారులతో కొనుగోళ్లు ప్రారంభించారు. హమాలీలు అందుబాటులో లేకపోవడంతో పక్కనే ఉన్న కడుమారు నుంచి కొందరు వచ్చారు. మొదటి నుంచి తామే వేస్తున్నామని తమకే అవకాశం ఇవ్వాలని అక్కడకు చేరుకొన్న మిడుతూరు హమాలీలు విజ్ఞప్తి చేశారు. రెండు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా సెబ్‌ ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 9 మంది ఎస్సైలు, 100 మంది సివిల్‌, రిజర్వుడు పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని