మూతబడి.. తెరుచుకుంటున్నాయ్‌!
eenadu telugu news
Published : 20/10/2021 04:06 IST

మూతబడి.. తెరుచుకుంటున్నాయ్‌!

ఇప్పటికే ఆరు అందుబాటులోకి..

జిల్లా విద్యాశాఖ కసరత్తు

న్యూస్‌టుడే-మెదక్‌, రేగోడ్‌

టేక్మాల్‌ మండలం గడ్డమీదిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

నుభవజ్ఞులైన ఉపాధ్యాయులు...ఉచిత విద్య, మధ్యాహ్నభోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు పలు కారణాలతో మూతపడ్డాయి. ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపడమూ ఓ కారణం. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల జోరు కొనసాగుతుండగా.. గతంలో మూతపడిన తిరిగి తెరిపించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే పలు చోట్ల ప్రారంభం కాగా, రాబోయే రోజులలో మరిన్నింటిని తెరిచేలా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో సర్కారు బడులు 897 ఉన్నాయి. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తితో గతేడాది మార్చిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత సెప్టెంబరులో పునఃప్రారంభం కాగా, కొద్దిరోజులకే మూసివేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో గత నెల ఒకటో తేదీ నుంచి తెరిచారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 65 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా ప్రవేశాల కోసం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి.. అవగాహన కల్పించి.. విద్యార్థులను చేర్పిస్తుంటారు. గతేడాది, ప్రస్తుత విద్యా సంవత్సరంలో సదరు కార్యక్రమం నిర్వహించకపోవడంతో విద్యార్థులు చేరలేదు.

పునఃప్రారంభం.... జిల్లాలో ఆయా మండలాల్లో 26 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. రేగోడ్‌ మండలంలో 2, అల్లాదుర్గంలో ఒకటి, టేక్మాల్‌ 4, హవేలిఘనపూర్‌ 3, రామాయంపేట 3, నిజాంపేట 2, చిన్నశంకరంపేట 2, కొల్చారం 3, తూప్రాన్‌ 2, మెదక్‌ పట్టణంలో 2, కౌడిపల్లి, నర్సాపూర్‌, వెల్దుర్తి, తూప్రాన్‌లో ఒక్కో పాఠశాల ఉంది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపడం.. విద్యార్థుల ప్రవేశాలు లేక మూతపడ్డాయి. వీటిలో తిరిగి తరగతులు కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కో పాఠశాల తెరిచేలా అధికారులు దృష్టి పెట్టారు. తొలుత పాఠశాలకు ఒక్కో ఉపాధ్యాయుడిని నియమించారు. వారిచేత గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. దీంతో రామాయంపేటలోని తండా పాఠశాలలో 16 మంది, అదే మండలంలోని కోనాపూర్‌లో 11, నిజాంపేట మండలం కాసీంపూర్‌లో 20, టేక్మాల్‌ మండలం గడ్డమీదిపల్లిలో 13, తూప్రాన్‌లోని న్యూ హమ్నాపూర్‌లో 15 మంది విద్యార్థులు చేరారు. ఆయాచోట్ల ఉపాధ్యాయులు తరగతులను కొనసాగిస్తున్నారు.

తిరిగి విద్యార్థులు చేరేలా.. రమేశ్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి

జిల్లాలో రెండు, మూడేళ్లుగా మూతపడిన ప్రాథమిక పాఠశాలల్లో ఇంకా 20 ఉన్నాయి. వాటిని సైతం రాబోయే రోజులలో పునఃప్రారంభించేలా దృష్టి సారించాం. ఒక్కో పాఠశాలకు ఒక్కో ఉపాధ్యాయుడిని కేటాయించి.. స్థానికులకు అవగాహన కల్పించి తిరిగి విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని